Flights : దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) త్వరలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతోంది. ఎంతో ముఖ్యమైన, నిత్యవసరంగా మారిన పవర్ బ్యాంకుల (Power Banks) వాడకాన్ని దేశీయ విమానాల్లో నిషేధించేందుకు కసరత్తు చేస్తోంది.
సాధారణంగా మొబైల్ చార్జింగ్ కోసం విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడం సర్వసాధారణం. అయితే, ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ పవర్ బ్యాంక్ నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది చాకచక్యంగా మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అప్రమత్తమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయానికి సిద్ధమైంది.
నిషేధం లేదా పరిమితి?
పవర్ బ్యాంకులు, లిథియం-అయాన్ బ్యాటరీల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉండటంతో, DGCA రెండు ప్రధాన అంశాలను పరిశీలిస్తోంది. దేశీయ విమాన సర్వీసుల్లో పవర్ బ్యాంక్‌లను పూర్తిగా నిషేధించడం. లేదా, నిర్దిష్ట సామర్థ్యం (తక్కువ పవర్) ఉన్న పవర్ బ్యాంక్‌లను మాత్రమే అనుమతించడం.ప్రస్తుతం అనేక అంతర్జాతీయ విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వినియోగంపై ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది. ఇదే పద్ధతిని దేశీయ విమానాల్లోనూ పాటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
త్వరలో కొత్త మార్గదర్శకాలు
ఈ అంశంపై డీజీసీఏ త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే, ప్రయాణికులు తమ లగేజీలో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లలో పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడానికి వీలుండదు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయం, విమాన ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. విమాన ప్రయాణానికి సిద్ధమవుతున్నవారు ఇకపై ఈ కొత్త నిబంధన గురించి తప్పక తెలుసుకోవాలి.


