Malegaon Blast Case: మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న ఒక దుర్ఘటన సంభవించింది. ఓ మసీదు సమీపంలో మోటార్ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశం మొత్తం భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన సంభవించడంతో అప్పటి ప్రభుత్వం ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్‌కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి లను ప్రధాన నిందితులుగా కేసు నమోదు చేసారు.
మాలేగావ్ బాంబ్ పేలుడు కేసులో దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ వాదనల్లో తీవ్రమైన లోటుపాట్లు ఉన్నాయని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మీద పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ రిజిస్టర్ అయిందన్న ప్రాసిక్యూషన్ వాదనకు సరిపడే సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ కేసులో బలమైన ఆధారాలు లేవు. కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినీ శిక్షించలేం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా వేరే నిర్ధారిత ఆధారాలు లేవు’’ అని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో పలువురు నిందితులకు విముక్తి లభించింది.
ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన భాజపా మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ల పేర్లు పేర్కొనాలని కోరారని ఆమె ఆరోపించారు.
‘‘భాజపా సీనియర్ నేత రామ్ మాధవ్ సహా పలువురు నేతల పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. నన్ను శారీరకంగా హింసించారు. ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించారు. గుజరాత్‌లో నివసిస్తున్నానన్న కారణంగా ప్రధాని మోదీ పేరును చెప్పమన్నారు. కానీ అవి అబద్ధాలు కావడంతో నేను ఎవరి పేరూ చెప్పలేదు,’’ అని ఆమె వివరించారు.
Readmore: https://teluguprabha.net/national-news/life-imprisonment-for-prajwal-revanna-in-rape-case/
ఈ ఆరోపణల నేపథ్యంలో మాలేగావ్ కేసు దర్యాప్తుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు బృందంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్ ముజావ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ప్రజ్ఞా ఠాకూర్ చేసిన ఆరోపణలపై అధికార వర్గాలు స్పందించాల్సిన అవసరం నెలకొంది. విచారణ ప్రక్రియలో రాజకీయ మలినతలపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చలు మొదలయ్యాయి.


