మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో కాసేపట్లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో ఆయన పార్థివదేహం ఉంచారు. ఈ తరుణంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ (Sharmistha Mukherjee) కాంగ్రెస్ అగ్ర నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షడు మల్లికార్జున ఖర్గే కోరడాన్ని ఆమె విమర్శించారు. పార్టీకి సుదీర్ఘ సేవలందించి రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే కాంగ్రెస్ అగ్రనేతలు కనీసం స్మారకమే అడగలేదన్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు కనీసం CWC సమావేశం కాలేదని మండిపడ్డారు. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదంటూ ఓ నేత చెప్పారని అన్నారు. కానీ కేఆర్ నారాయణన్ (KR Narayanan) చనిపోతే సీడబ్ల్యూసీ సమావేశమై సంతాపం తెలిపారని గుర్తు చేశారు. ఆయన సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీనే రాశారని పేర్కొన్నారు.