Prashant Kishor on Bihar elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంటున్న వేళ, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌కు, 2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమేఠీలో పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. యాదవుల కంచుకోటగా భావించే రఘోపుర్‌లోనే తేజస్వీ ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. అసలు ప్రశాంత్ కిశోర్ ఇంత ధీమాగా ఎందుకు చెబుతున్నారు…? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహమేంటి..?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య రాజకీయ సమరం తీవ్రస్థాయికి చేరుతోంది. తాజాగా పట్నాలో విలేకరులతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తేజస్వీ తన సిట్టింగ్ స్థానమైన రఘోపుర్‌ను కోల్పోవడం ఖాయమని కుండబద్దలు కొట్టారు.
అభివృద్ధి శూన్యం.. అందుకే ఓటమి ఖాయం : రఘోపుర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబ ఆధిపత్యానికి చరమపలకాలని ప్రజలు కోరుకుంటున్నారని పీకే అన్నారు. “తేజస్వీ యాదవ్‌కు ముందు, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవి ఏళ్ల తరబడి ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అయినా నేటికీ ఆ నియోజకవర్గం కనీస మౌలిక వసతుల కోసం అల్లాడుతోంది. అందుకే అక్కడి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికే నేను రఘోపుర్‌కు వెళ్తున్నాను,” అని పీకే ఆరోపించారు. జన్ సురాజ్ పార్టీ అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెడుతుందని, ఆ అభ్యర్థి తానే కావొచ్చనే విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.
“అమేఠీ సీన్ రిపీట్ అవుతుంది” : తేజస్వీ యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చని వస్తున్న పుకార్లపై విలేకరులు ప్రశ్నించగా, ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యంగా నవ్వారు. “రెండు చోట్ల పోటీ చేయనివ్వండి… రఘోపుర్‌లో మాత్రం ఆయన భవితవ్యం, 2019లో అమేఠీలో రాహుల్ గాంధీకి పట్టిన గతే అవుతుంది. ఆ ఎన్నికల్లో రాహుల్ రెండు స్థానాల్లో పోటీ చేసి, చివరికి తన కంచుకోట అయిన అమేఠీని కోల్పోయారు. ఇప్పుడు తేజస్వీ వంతు,” అంటూ పీకే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇతర నేతలపైనా విమర్శలు : ఈ సందర్భంగా భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ తనను కలవడంపై కూడా పీకే స్పందించారు. పవన్ సింగ్ తనకు మిత్రుడేనని, వారి వైవాహిక వివాదంలో తాను గానీ, తన పార్టీ గానీ తలదూర్చబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో, బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మంత్రి అశోక్ చౌదరి వంటి వారు జన్ సురాజ్ పార్టీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన వారి అసంతృప్తిపై మాట్లాడుతూ, “వేలాది మంది తమ రక్తం, చెమట, కన్నీళ్లతో పార్టీని నిర్మించారు. అందరికీ 243 సీట్లలో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు. మాది ప్రజాస్వామ్య పార్టీ, అందరినీ కలుపుకొనిపోతాం,” అని ఆయన భరోసా ఇచ్చారు.


