Saturday, November 15, 2025
Homeనేషనల్Rajya Sabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Rajya Sabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Droupadi Murmu: భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురి వ్యక్తులను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. మాజీ దైత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్‌లను రాష్ట్రపతి పెద్దల సభకు నామినేట్‌ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా నామినేట్ అయిన నలుగురికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఇక రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అది కూడా సామాజిక సేవ, కళలు, సాహిత్యం, సైన్స్ వంటి రంగాలలో కృషి చేసిన వారిని ఈ స్థానాలకు నామినేట్‌ చేస్తారు. తాజాగా రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురి వ్యక్తుల వివరాల గురించి తెలుసుకుందాం.

హర్ష్ వర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హోదాలో అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌ దేశాల్లో రాయబారిగా విధులు నిర్వహించారు. 2023లో భారతదేశం అతిథ్యం వహించిన G20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.

డాక్టర్. మీనాక్షి జైన్: ప్రముఖ చరిత్రకారిణిగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి 2020లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగానూ విధులు నిర్వర్తించారు.

ఉజ్వల్ నికం: ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడుల కేసు విచారణలో వాదనలు వినిపించారు. అలాగే ఇతర కీలక క్రిమినల్ కేసుల్లోనూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
సదానందన్: కేరళకు చెందిన ఈయన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే సామాజిక కార్యకర్తగా పలు సేవలు అందించారు. 1994లో సీపీఎం నేతలు చేసిన దాడిలో రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.

Also Read: డీజిల్ లోడ్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad