Friday, February 13, 2026
HomeTop StoriesBudget Speech : దశాబ్ద ప్రగతి.. వికసిత భారత్‌ రీతి! పదేళ్లలో 25 కోట్ల మందికి...

Budget Speech : దశాబ్ద ప్రగతి.. వికసిత భారత్‌ రీతి! పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: రాష్ట్రపతి ముర్ము

President Murmu Budget Speech 2026 : “గత దశాబ్ద కాలం భారత చరిత్రలో సువర్ణాధ్యాయం. సంస్కరణలే ఊపిరిగా, సంక్షేమమే ధ్యేయంగా సాగిన ప్రస్థానంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం అనే కోరల నుంచి విముక్తి చేయగలిగాం. వికసిత భారత్ కల సాకారమయ్యే దిశగా దేశం వడివడిగా అడుగులు వేస్తోంది.” అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. బుధవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం, దేశ ప్రగతిని ఆవిష్కరిస్తూనే భవిష్యత్ లక్ష్యాలకు దిశానిర్దేశం చేసింది. పేదలు, మహిళలు, యువత, రైతుల అభ్యున్నతే కేంద్రంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, వందేభారత్ నుంచి అంతరిక్ష కేంద్రం వరకు భారత్ సాధిస్తున్న విజయాలను ఆమె సగర్వంగా వివరించారు. 

- Advertisement -

పేదరికంపై ప్రబల విజయం – సంక్షేమమే ఊపిరి : ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణల వల్లే పేదరికం తగ్గుముఖం పట్టిందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
25 కోట్ల మందికి విముక్తి: గత పదేళ్లలో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక స్వావలంబన చర్యల ద్వారా 25 కోట్ల మంది పేదరికం గీత దాటారని తెలిపారు.
గూడు – నీడ: పేదల సొంతింటి కలను నిజం చేస్తూ 4 కోట్ల ఇళ్లను నిర్మించామని, జల్‌జీవన్ మిషన్ ద్వారా కోట్లాది మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు.
ఆరోగ్య రక్ష: ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోందని, సికిల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులపై యుద్ధం కొనసాగుతోందని పేర్కొన్నారు.

టెక్నాలజీ హబ్‌గా భారత్ – సొంత స్పేస్ స్టేషన్ దిశగా : భారత్ ఇప్పుడు కేవలం టెక్నాలజీని వాడుకునే దేశం కాదని, టెక్నాలజీని సృష్టించే ‘పవర్ హబ్’గా మారిందని రాష్ట్రపతి అభివర్ణించారు.
అంతరిక్షంలో అద్భుతాలు: దేశం త్వరలోనే తన సొంత ‘అంతరిక్ష కేంద్రాన్ని’ (Space Station) ఏర్పాటు చేసుకోబోతోందని ప్రకటించారు. స్పేస్ టూరిజంలోనూ భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

స్టార్టప్ జోరు: స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందని, కొత్తగా 25 లక్షల స్టార్టప్ సంస్థలు నమోదయ్యాయని వెల్లడించారు.
చిప్ తయారీ: నానో చిప్స్, మైక్రో చిప్‌ల తయారీలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని, ఎలక్ట్రానిక్స్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు.

రైతన్నకు దన్ను – వరిలో నంబర్ వన్ : వికసిత భారత్ నిర్మాణంలో రైతుది ప్రథమ పాత్ర అని ముర్ము పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచ అగ్రగామి: వరి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.
గ్రామీణ ఉపాధి: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం ‘జీ రామ్ జీ’ (G-Ram G) చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రస్తావించారు. ఆహార శుద్ధి రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.

రక్షణ – విదేశాంగం: సరిహద్దుల్లో సత్తా : దేశ రక్షణ విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్రపతి తేల్చిచెప్పారు.
ఆపరేషన్ సిందూర్: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మన సత్తాను ప్రపంచానికి చాటిందని, భారత్‌పై దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రపంచం చూసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
విశ్వగురు స్థానం: అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రపంచ దేశాలకు భారత్ ఒక వారధిగా నిలుస్తోందని అన్నారు. యూరోపియన్ యూనియన్ (EU)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం శుభపరిణామమని తెలిపారు.

మౌలిక వసతులు – రవాణా
వందేభారత్ వేగం: దేశంలో ప్రస్తుతం 150కి పైగా వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయని, అమృత్ భారత్ రైళ్లతో సేవలను మరింత విస్తరించామని చెప్పారు.
2030 లక్ష్యం: 2030లో కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా, వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని, బిర్సాముండా, సర్దార్ పటేల్, భూపేన్ హజారికా వంటి మహనీయులను స్మరించుకుంటూ.. సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతి కలగలిసిన ‘వికసిత భారత్’ నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News