President Murmu Independence Day Speech : ఒకవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూనే.. మరోవైపు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న నవ భారతం ఆవిష్కృతమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, దేశ సరికొత్త ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఆమె చేసిన ప్రస్తావన ఉగ్రమూకలకు గట్టి హెచ్చరిక పంపింది.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం : పహల్గాంలో అమాయక యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా, అమానుషంగా అభివర్ణించిన రాష్ట్రపతి, దేశం మొత్తం ముక్తకంఠంతో దీనిని ఖండించిందని గుర్తుచేశారు.
”పహల్గాం ఉగ్రదాడిని దేశమంతా ఏకతాటిపై ఖండించింది. మనల్ని విభజించాలని చూసే శక్తులకు ఇది దీటైన జవాబు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రమూకలకు మన సైన్యం గట్టి గుణపాఠం నేర్పింది. దేశాన్ని కాపాడే విషయంలో మన సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. ఉగ్రవాదంపై మానవాళి చేస్తున్న పోరాటంలో ఇది ఒక చారిత్రక ఉదాహరణగా నిలిచిపోతుంది.”
– ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి
పరుగులు పెడుతున్న ఆర్థిక ప్రగతి : సుపరిపాలన, అవినీతి రహిత విధానాలతో దేశం స్వావలంబన దిశగా దృఢ విశ్వాసంతో సాగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచించే కీలక అంశాలను ఆమె ప్రస్తావించారు.
వృద్ధి రేటు: గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం: ధరల పెరుగుదల నియంత్రణలోకి వచ్చిందని, సామాన్యుడికి ఊరట లభిస్తోందని అన్నారు.
పెరిగిన ఎగుమతులు: మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఎగుమతులు పెరిగాయని స్పష్టం చేశారు.
అభివృద్ధి లక్ష్యం: సామాజిక సంక్షేమంతో కూడిన సమగ్ర ఆర్థిక వృద్ధి, 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్‌ను నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నవ భారత నిర్మాణంలో కీలక అడుగులు : దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్న పలు అంశాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొన్నారు.
కశ్మీర్‌లో శాంతి: కశ్మీర్ లోయలో రైలు మార్గం నిర్మాణం ద్వారా పర్యాటకం, వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతాయని అన్నారు.
గగనంలోకి భారత్: ‘గగన్‌యాన్’ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం, శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర యువతలో కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయని కొనియాడారు.
క్రీడారంగంలో సత్తా: చెస్ వంటి క్రీడల్లో మన యువత అపూర్వ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
విద్యా సంస్కరణలు: జాతీయ విద్యా విధానం-2020 దేశ విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
అసమానతల తగ్గింపు: దేశంలో ఆదాయ, ప్రాంతీయ అసమానతలు క్రమంగా కనుమరుగవుతున్నాయని అన్నారు.రాష్ట్రపతి ప్రసంగం దేశ సమష్టి పురోగతిని, భవిష్యత్ అవకాశాలను ప్రతిబింబించేలా ఆలోచనాత్మకంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.


