Sunday, February 8, 2026
Homeనేషనల్Press Council : పత్రికా స్వేచ్ఛకు కాపలా కరువు.. ప్రెస్ కౌన్సిల్‌కు సారథి ఏడి?

Press Council : పత్రికా స్వేచ్ఛకు కాపలా కరువు.. ప్రెస్ కౌన్సిల్‌కు సారథి ఏడి?

Press Council of India chairperson vacancy : పత్రికా స్వేచ్ఛకు కాపలా కాయాల్సిన అత్యున్నత సంస్థే, ఇప్పుడు నాథుడు లేక నిర్వీర్యమైంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాకు నైతిక దిక్సూచిగా నిలవాల్సిన ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (PCI), తన చరిత్రలోనే తొలిసారిగా ఛైర్‌పర్సన్ లేకుండా మిగిలిపోయింది. గత ఛైర్‌పర్సన్ పదవీకాలం ముగిసి నెల రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం కొత్త నియామకం చేపట్టకపోవడంపై దేశవ్యాప్తంగా మీడియా సంఘాలు, పాత్రికేయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

- Advertisement -

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, గత నెల డిసెంబర్ 16, 2025న తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ అత్యంత కీలకమైన పదవి ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో, ప్రెస్ అసోసియేషన్‌తో పాటు, ముంబయి, అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, చండీగఢ్-పంజాబ్ జర్నలిస్టు సంఘాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేసి, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఒకటి కాదు.. రెండు సమస్యలు : ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఎదుర్కొంటున్నది కేవలం ఛైర్‌పర్సన్ లేకపోవడం మాత్రమే కాదు, పూర్తిస్థాయి కౌన్సిల్ ఏర్పడకపోవడం కూడా. జస్టిస్ దేశాయ్ పదవీ విరమణతో, కౌన్సిల్‌కు నాథుడు లేకుండా పోయారు. ఇది సంస్థ చరిత్రలోనే తొలిసారి. వాస్తవానికి, 14వ కౌన్సిల్ పదవీకాలం ఏడాది క్రితమే ముగిసింది. కానీ, 15వ కౌన్సిల్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. ప్రెస్ కౌన్సిల్‌లో మొత్తం 29 మంది సభ్యులు (ఛైర్‌పర్సన్‌తో కలిపి) ఉండాలి. కానీ, ప్రస్తుతం కేవలం 14 మంది సభ్యులు మాత్రమే నియమితులయ్యారు. ఎడిటర్లు, వర్కింగ్ జర్నలిస్టుల కేటగిరీలలో నియామకాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియకు ఛైర్‌పర్సన్ నియామకమే కీలకం. ఛైర్‌పర్సన్ లేకపోతే, మిగిలిన సభ్యుల నియామక ప్రక్రియ ముందుకు సాగదు. ఈ కారణంగా, కౌన్సిల్ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి.

ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి : పత్రికా స్వేచ్ఛను కాపాడటం, మీడియా నైతిక ప్రమాణాలను పర్యవేక్షించడం, ప్రభుత్వానికి, పత్రికలకు మధ్య వారధిగా పనిచేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే ప్రెస్ కౌన్సిల్ వంటి చట్టబద్ధమైన, పాక్షిక-న్యాయవ్యవస్థ  నాథుడు లేకుండా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఓ ఉన్నతమైన వ్యక్తిని ఛైర్‌పర్సన్‌గా నియమించి, 15వ కౌన్సిల్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, తద్వారా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News