Prime Minister Modi Visits Violence-Hit Manipur: గత రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. హింస తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు. బాధితుల కన్నీళ్లను తుడుస్తూ, అభివృద్ధికి బాటలు వేసే భారీ ప్యాకేజీలను ప్రకటించి కొత్త భరోసా కల్పించారు.
దారి పొడవునా త్రివర్ణ పతాకాలతో ప్రజలు..
శనివారం ఉదయం ఇంఫాల్‌కు చేరుకున్న ప్రధాని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కుకీ-జో వర్గం అధికంగా ఉండే చురాచాంద్‌పూర్‌కు వెళ్లాల్సి ఉండగా, భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించలేదు. అయినప్పటికీ, పర్యటనను ఆపకుండా, దాదాపు గంటన్నర ప్రయాణించి రోడ్డు మార్గంలోనే అక్కడికి చేరుకున్నారు. దారి పొడవునా త్రివర్ణ పతాకాలతో ప్రజలు తనకు చూపిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని, హెలికాప్టర్‌లో రాకపోవడమే మంచిదైందని మోదీ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.
ALSO READ: Election Commission : ఓటరు జాబితా సవరణ.. సుప్రీంకోర్టులో ఈసీ కౌంటర్! “ఆ అధికారం మాదే!”
అండగా ఉంటాను..
చురాచాంద్‌పూర్‌లోని “పీస్ గ్రౌండ్”లో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ, మణిపూర్‌లో జరిగిన హింస దురదృష్టకరమని, ఇది మన పూర్వీకులకు, భవిష్యత్ తరాలకు తీరని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. “శాంతి నెలకొంటేనే అభివృద్ధి సాధ్యం. మీ కలలు, మీ పిల్లల భవిష్యత్తు సాకారం కావాలంటే అన్ని వర్గాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి. నేను మీకు అండగా ఉంటాను, భారత ప్రభుత్వం మణిపూర్ ప్రజలతోనే ఉంటుంది,” అని హామీ ఇచ్చారు.
ప్రధానిని చూసి కన్నీటిపర్యంతమైన బాధితులు..
పర్యటనలో భాగంగా మెయితీ ప్రాబల్యం ఉన్న ఇంఫాల్, కుకీల కేంద్రమైన చురాచాంద్‌పూర్‌లలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లోని బాధితులను ప్రధాని కలుసుకున్నారు. ప్రధానిని చూడగానే బాధితులు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. వారి బాధలను ఓపికగా విన్న మోదీ, వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చురాచాంద్‌పూర్‌లో చిన్నారులు పాడిన “భారత్ కీ బేటీ” పాటను విని ముగ్ధులయ్యారు.
ALSO READ: Dubai Asia Cup: రక్తం క్రికెట్ కలిసి ప్రవహించలేవ్.. ఇండియా పాక్ మ్యాచ్‌పై ఉద్ధవ్ థాక్రే సీరియస్
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రధాని భారీ ప్యాకేజీ
ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రధాని భారీ ప్యాకేజీలు ప్రకటించారు. హింస కారణంగా నిరాశ్రయులైన వారి కోసం 7,000 కొత్త గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం కోసం కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ. 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీలో, రూ. 500 కోట్లకు పైగా కేవలం నిరాశ్రయుల సహాయం కోసమే కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో పాటు, చురాచాంద్‌పూర్‌లో రూ. 7,300 కోట్లు, ఇంఫాల్‌లో రూ. 1,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రైలు, రోడ్డు మార్గాల విస్తరణతో మణిపూర్‌ను దేశంతో మరింత అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు.
మే 2023లో మెయితీ, కుకీ వర్గాల మధ్య భూమి, ఉద్యోగాల విషయంలో మొదలైన ఘర్షణల్లో ఇప్పటివరకు 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో, ప్రధాని పర్యటన రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు, ప్రజల్లో నమ్మకాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మణిపుర్‌లో హింస చెలరేగిన రెండున్నర ఏళ్ల తర్వాత అక్కడ ప్రధాని పర్యటించడంపై కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ALSO READ: Yogi Adityanath: చిన్న విషయాలే అని లైట్ తీసుకోవద్దు- నేపాల్ సంక్షోభంపై యోగి కామెంట్స్


