Prime Minister Modi birthday gift: సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ తన 75వపుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్నారని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.
75వేల ఆరోగ్య శిబిరాల‌్లో ఏర్పాటు: మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే నూతన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని అన్నారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75 వేల ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలను అందిస్తామని అన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులకు విజ్ఞప్తి: మహిళలతో పాటుగా పిల్లల ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహించడానికి అన్ని అంగన్‌వాడీలలో పోషణ్ మాహ్ అనే కార్యక్రమం ద్వారా ఇది నిర్వహించబడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కుటుంబాలు, సాధికారత కలిగిన సంఘాలను నిర్మించడమే ఈ చర్యల లక్ష్యమని జేపీ నడ్డా తెలిపారు. అలాగే అన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు, ఆరోగ్య సంరక్షణ వాటాదారులు ముందుకు వచ్చి ఈ జన్ భాగీదారీ అభియాన్‌లో పాల్గొనాలని కేంద్రమంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధిని విస్తరించిన కేంద్రం: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికొస్తుంది. కానీ, తీరా కోత కోసి ఇంటికి తెచ్చుకున్నాక కూడా అకాల వర్షాలు, మార్కెట్ మాయాజాలం వారిని వెంటాడుతూనే ఉంటాయి. కేవలం పంటలే కాదు, అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం కూడా ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతూ రైతును నిలువునా ముంచుతున్నాయి. ఈ కష్టాలకు చెక్ పెడుతూ, రైతుకు మరింత భరోసానిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధిని విస్తరించింది.
వ్యవసాయ అనుబంధ రంగాలకూ విస్తరణ: వ్యవసాయంతో పాటు పాడి పశువులను, చేపల పెంపకాన్ని నమ్ముకున్న రైతులు ఎందరో. వరదలు, పిడుగుపాట్ల వంటి విపత్తుల సమయంలో పశు సంపదను కోల్పోయి వీధిన పడుతున్నారు. ఆక్వా రైతులదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పశుపోషకులు, మత్స్యకారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంపదకు, ఆక్వాకు కూడా వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


