బృందావన్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టు అగ్గి రాజేస్తోంది. బంకి బిహారీ మందిరం చుట్టూ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్ పనులను అడ్డుకునేందుకు స్థానికులు, వ్యాపారులు, పూజారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. గత కొన్ని రోజులుగా యూపీ సర్కారు, కేంద్రానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహించిన నిరసనకారులంతా తమ రక్తంతో ప్రధాని నరేంద్ర మోడీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు లేఖలు రాయటం సంచలనం సృష్టిస్తోంది. బృందావన్ కారిడార్ ప్రాజెక్టు ప్రతులను తగులబెట్టి..తమ రక్తంతో మొత్తం 108 లేఖలను రాశారు భక్తులు.
బృందావనం పవిత్రతను కాపాడాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా మందిరాన్ని ఆనుకున్న వీధుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా తమ వ్యాపారాలు మూసేసి రోడ్డెక్కారు. కాశీ విశ్వనాథ్ టెంపులు కారిడార్ ప్రాజెక్టులా దీన్ని నిర్మిస్తే చాలా మంది ఉపాధి కోల్పోగా., ఇంకా పెద్ద సంఖ్యలో సొంత ఇల్లు కోల్పేయే వారి సంఖ్య ఎక్కువ వీరు మండిపడుతున్నారు. బంకి బిహారీ మందిరంలో కృష్ణుడు చిన్న బాలుడిలా ఉంటూ దర్శనం ఇస్తాడు..అయితే ఈ మందరంలో తరచూ తొక్కిసిలాట జరిగి భక్తులు చనిపోతుంటారు. ఈనేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునే పరిష్కారాలు ఆలోచించి నివేదిక ఇవ్వాలని కోర్టులు ఆదేశించాయి. అయితే ప్రభుత్వం తలపెట్టిన ఈ కారిడార్ పనులు ఆపేయాలంటూ స్థానికులు న్యాయపోరాటానికి దిగారు.