Public Holiday On Valmiki Jayanthi: దసరా పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు దాదాపు పది రోజుల పాటు సెలవులు వచ్చాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదంగా పండుగ జరుపుకున్న విద్యార్థులకు శనివారం నుంచి తరగతులు పునః ప్రారంభమయ్యాయి. అయితే, ఆ తర్వాతి రోజు ఆదివారం రావడంతో అదనంగా మరో రోజు సెలవు లభించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి చాలా మంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. అయితే, విద్యార్థులకు రేపు (మంగళవారం) మరో సెలవు రానుంది. దీంతో ఆనందంతో ఎగిరి గెంతులేస్తున్నారు. అయితే, ఇది తెలుగు రాష్ట్రాల వారికి కాదని గమనించాలి. వాల్మీకి జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్టోబర్ 7న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సిబ్బంది శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాల్మీకి జయంతిని ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్ నుంచి తొలగించి ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దీంతో, అక్టోబర్ 7న మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ సెలవుదినంగా ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, విభాగాలు పూర్తిగా మూసి ఉంటాయని తెలిపింది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు వర్తించని సెలవు..
2025 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాలో మహర్షి వాల్మీకి జయంతిని ఆప్షనల్ హాలిడేస్ లిస్టులో చేర్చారు. రిజిస్టర్డ్ సెలవులు అంటే ఉద్యోగులు తమ ఇష్టానుసారం సంవత్సరంలో కొన్ని సెల0వులను ఎంచుకోవచ్చు. ఈ సెలవుదినం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం 1881కి లోబడి ఉండదని కూడా ఆర్డర్ స్పష్టం చేస్తుంది. అంటే ఇది ప్రభుత్వ సెలవుదినం అయినప్పటికీ, ఇది సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు వర్తించదు. తప్పనిసరి సెలవుల వర్గంలోకి రాదు. దీంతో, అక్టోబర్ 7న ఉత్తరప్రదేశ్‌లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పనిచేయనున్నాయి. అయితే, వాల్మీకి జయంతికి సంబంధించిన సెలవు దినాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని కార్యాలయాలు, పాఠశాలలు మరియు విభాగాలకు మాత్రమే వర్తించనుంది.
రామాయణం రచించిన వాల్మీకి మహర్షి..
కాగా, రామాయణ రచయిత మహర్షి వాల్మీకి ఆదికవిగా ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం అశ్విని మాసంలోని ప్రకాశవంతమైన పక్షం పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం పుట్టినరోజు అక్టోబర్ 7న వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున వాల్మీకి సమాజం ఉంటుంది. అందుకే వారిని దృష్టిలో పెట్టుకొని సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు వాల్మీకి వర్గానికి చెందిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వారు దేవాలయాలలో పూజలు చేస్తారు. ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా, సామాజికంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, వాల్మీకి మహర్షిపై ప్రశంసలు కురిపించారు. వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా సమాజానికి ఐక్యత, సామరస్యం సందేశాన్ని అందించారని కొనియాడారు.


