Rameswaram: పులస చేప పేరు వినగానే తెలుగు రాష్ట్రాల వారికి దాని రుచి, ధర, ‘పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినాలి’ అనే నానుడి గుర్తుకొస్తాయి. అయితే, ఇప్పుడు పులసను సైతం మించిన ధరకు అమ్ముడుపోయిన రెండు అరుదైన చేపల వార్త సంచలనం సృష్టిస్తోంది.
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్న పంబన్ ఓడరేవు పరిధిలో ఈ అద్భుత సంఘటన జరిగింది. సుమారు 80 పడవల్లో 600 మందికి పైగా జాలర్లు చేపల వేటకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతానికి వెళ్లారు. వారిలో కొందరికి అనుకోకుండా వలలో రెండు భారీ క్యాట్‌ఫిష్‌లు చిక్కాయి.
ఆ చేపల ప్రత్యేకత ఏమిటంటే..
ఈ రెండు చేపల్లో ఒకటి 22 కిలోలు, మరొకటి 24 కిలోలు బరువు తూగాయి. సాధారణంగా మార్కెట్‌లో వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ప్రత్యేకమైన జాతి చేపలకు వేలంలో కిలోకు అక్షరాల రూ.3,000 చొప్పున ధర పలికింది.రెండు చేపల ద్వారా జాలర్లకు ఏకంగా రూ.1,65,000 (ఒక లక్షా అరవై ఐదు వేల రూపాయలు) ఆదాయం లభించింది. ఇది జాలర్లకు దసరా పండుగ ముందు వచ్చిన బహుమతిలాంటిదే.
ధర పెరగడానికి అసలు కారణం..
ఈ క్యాట్‌ఫిష్‌లు అంత భారీ ధర పలకడానికి కారణం వాటి రుచి లేదా పరిమాణం మాత్రమే కాదు. ఈ అరుదైన చేపలలో అధిక ఔషధ గుణాలు ఉంటాయని స్థానికులు నమ్ముతారు. అంతేకాక, అంతర్జాతీయంగా వీటిని అత్యంత ఖరీదైన సూప్‌లు ,ప్రత్యేక వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. వీటి కొవ్వు, కొన్ని అంతర్గత భాగాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే కొనుగోలుదారులు పోటీపడి ఈ రికార్డు ధర చెల్లించారు.
ఈ ఘటనతో పంబన్ జాలర్లలో సంతోషం వెల్లివిరిసింది. ఏళ్ల తరబడి కష్టపడే జాలర్లకు ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం నిజంగా అద్భుతమే. పులస రికార్డును మించిన ఈ క్యాట్‌ఫిష్‌ల వేట కథ, ఇప్పుడు మత్స్య ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.


