Saturday, November 15, 2025
Homeనేషనల్Baby sale : డ్రగ్స్ కోసం కన్నబిడ్డను అమ్మేశారా? లేక దత్తత ఇచ్చారా?

Baby sale : డ్రగ్స్ కోసం కన్నబిడ్డను అమ్మేశారా? లేక దత్తత ఇచ్చారా?

Punjab baby sale case twist : “మత్తు కోసం నా భర్త, అత్త కలిసి నా మూడు నెలల పసికందును అమ్మేశారు!” – ఓ తల్లి చేసిన ఈ ఆరోపణ పంజాబ్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన వేళ, కేసు అనూహ్య మలుపు తిరిగింది. “మేము బిడ్డను కొనలేదు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్నాం” అంటూ ఆ శిశువుతో పాటు ఓ కుటుంబం మీడియా ముందుకు రావడంతో, ఈ వ్యవహారంలో అసలు నిజమేంటి? అనే ప్రశ్న తలెత్తుతోంది. అమ్మకం వెనుక ఉన్నది మత్తు వ్యసనమా, లేక పేదరికపు నిస్సహాయతా..?

- Advertisement -

అసలేం జరిగిందంటే? తల్లి ఫిర్యాదు : పంజాబ్‌లోని మాన్సా జిల్లా, బరేటా పట్టణానికి చెందిన ఓ మహిళ, పోలీసులకు సంచలన ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్త మాదకద్రవ్యాలకు బానిసలని, వాటి కోసం డబ్బు సంపాదించేందుకు, తమ మూడు నెలల కుమారుడిని రూ.1.80 లక్షలకు అమ్మేశారని ఆమె ఆరోపించింది. తన బిడ్డను తనకు ఇప్పించాలని ఆమె కన్నీటితో వేడుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

కొత్త కోణం.. దత్తత తీసుకున్నామంటున్న కుటుంబం : పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే, గంగారామ్ అనే వ్యక్తి ఆ శిశువుతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తాము బిడ్డను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నామని స్పష్టం చేశారు.

“ఆ పిల్లవాడి తండ్రి, నానమ్మ మమ్మల్ని కలిసి, తాము మాదకద్రవ్యాల బానిసలమని, బిడ్డను పెంచలేమని చెప్పారు. అందుకే, ఎలాంటి డబ్బు తీసుకోకుండా మాకు దత్తత ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలు, వీడియోలు మా వద్ద ఉన్నాయి. మాకు నలుగురు ఆడపిల్లలు, కొడుకు లేడనే ఆ బిడ్డను పెంచుకుంటున్నాం.”
– గంగారామ్, దత్తత తీసుకున్న వ్యక్తి

అత్తారింటి ఒత్తిడితోనే ఫిర్యాదా? : దత్తత తీసుకున్న కుటుంబ సభ్యురాలు జ్యోతి కౌర్ మాట్లాడుతూ, “మేం తీసుకున్నప్పుడు ఆ పిల్లాడు అనారోగ్యంతో ఉన్నాడు. మేమే చికిత్స చేయించాం. రెండున్నర నెలలుగా లేని ఫిర్యాదు, ఇప్పుడెందుకు వచ్చింది? ఆ తల్లితో నేను మాట్లాడితే, అత్తారింటి వాళ్ల ఒత్తిడితోనే ఫిర్యాదు చేశానని చెప్పింది,” అని తెలిపారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు : ఈ కొత్త మలుపుతో, పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. “తల్లిదండ్రులు మాదకద్రవ్యాల బానిసలనే ఆరోపణలపై విచారిస్తున్నాం. అదే సమయంలో, దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. సమగ్ర దర్యాప్తు తర్వాతే చర్యలు తీసుకుంటాం,” అని డీఎస్పీ సికందర్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad