PM Modi’s foreign policy scrutiny : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. తాజాగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. 10 వేల జనాభా కూడా లేని చిన్న చిన్న దేశాల్లో ప్రధాని మోదీ ఎందుకు పర్యటిస్తున్నారు.? అసలు ఆయన ఏయే దేశాలకు వెళ్తున్నారో పైనున్న ఆ దేవుడికే తెలియాలని భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఉండకుండా, చిన్న దేశాలను సందర్శించడం, అక్కడ అవార్డులు అందుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక జేసీబీ యంత్రం పనిచేస్తుంటే చూడటానికి పది వేల మంది గుమిగూడే దేశంలో, పదివేల జనాభా లేని దేశాలకు ప్రధాని వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తారు.
భగవంత్ మాన్ వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశ్యం, ప్రధాని మోదీ పెద్ద దేశాలను విస్మరించి, జనాభా తక్కువగా ఉన్న చిన్న దేశాలపై దృష్టి సారించడం. దేశీయ సమస్యలను విస్మరించి విదేశీ పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వడంపైనే ఆయన అభ్యంతరమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాంగ శాఖ ఆగ్రహం -కాంగ్రెస్ విమర్శలు : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేసిన ఈ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఇవి “బాధ్యతారహితమైన వ్యాఖ్యలు” అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారతదేశంతో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటంసరికాదని స్పష్టం చేసింది. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ : ప్రధాని విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా విమర్శలు గుప్పించారు. ఐదు దేశాల పర్యటనను ముగించుకుని తిరిగి భారత్‌కు వచ్చిన ప్రధాని మోదీ, మణిపూర్‌ను సందర్శించడానికి సమయం కేటాయించవచ్చని ఆయన అన్నారు. మణిపూర్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న అశాంతిని, హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, జీఎస్టీ సంస్కరణ వంటి కీలక అంశాలపై దృష్టి సారించకుండా విదేశీ పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది ప్రతిపక్షాల నుండి వస్తున్న సాధారణ విమర్శల ధోరణిని ప్రతిబింబిస్తుంది, దేశీయ సమస్యల పరిష్కారానికి ప్రధాని ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.

