Punjab DNA Test Initiative: గుడి ముందు, బస్టాండులో, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర.. మనకు జాలి కలిగించేలా చేతులు చాచే చిన్నారులను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఆ చిన్నారులతో పాటు ఉండే పెద్దలు నిజంగా వారి తల్లిదండ్రులేనా, లేక పిల్లల అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కిన అభాగ్యులా..? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఉంటుంది. ఈ చిక్కుముడిని విప్పేందుకు, భిక్షాటన ముసుగులో జరుగుతున్న ఘోర నేరాలను అరికట్టేందుకు పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం దేశంలోనే ముందెన్నడూ లేని విధంగా ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. భిక్షాటన చేసే బాలలకు, వారి సంరక్షకులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, అసలు నిజాన్ని నిగ్గు తేల్చనుంది.
దేశంలోనే తొలిసారిగా.. డీఎన్ఏ అస్త్రం : పంజాబ్‌ను ‘భిక్షాటన రహిత రాష్ట్రం’గా మార్చడమే లక్ష్యంగా అక్కడి ఆప్ సర్కారు ‘ప్రాజెక్ట్ జీవన్ జోత్-2’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా, భిక్షాటన చేస్తున్న పిల్లలకు, వారి వెంట ఉన్న పెద్దలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా వారి మధ్య జన్యుపరమైన సంబంధం ఉందో లేదో తేలుతుంది. ఒకవేళ డీఎన్ఏ మ్యాచ్ కాకపోతే, ఆ పెద్దలపై బాలల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటారు. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో రాష్ట్రంలోని ఐదు జిల్లాలైన పాటియాలా, భటిండా, లూథియానా, అమృత్‌సర్‌లలో ఈ డ్రైవ్‌ను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పరీక్షల ప్రక్రియ : ఈ వినూత్న కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
అనుమతులు: జిల్లా స్థాయి శిశు సంక్షేమ కమిటీల సిఫార్సు మేరకు, డిప్యూటీ కమిషనర్లు (డీసీ) డీఎన్ఏ పరీక్షలకు అనుమతి ఇస్తారు.
శాంపిళ్ల సేకరణ: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ల్యాబొరేటరీ సిబ్బంది పిల్లల నుంచి, పెద్దల నుంచి శాంపిళ్లను సేకరిస్తారు.
ఉచిత పరీక్షలు: సేకరించిన శాంపిళ్లను పంజాబ్ ప్రభుత్వ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పూర్తిగా ఉచితంగా పరీక్షిస్తారు.
గోప్యత: వారం రోజుల్లోగా వచ్చే ఈ డీఎన్ఏ నివేదికలను అత్యంత గోప్యంగా ఉంచి, నేరుగా సంబంధిత పోలీసు విభాగాలకు పంపిస్తారు.
బాలల సంరక్షణ: రిపోర్టులు వచ్చే వరకు, పిల్లలను జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల్లో సురక్షితంగా ఉంచుతారు.
డీఎన్ఏ మ్యాచ్ కాకపోతే.. కఠిన చర్యలే : డీఎన్ఏ నివేదికల్లో పిల్లలకు, వారి వెంట ఉన్న పెద్దలకు ఎలాంటి రక్త సంబంధం లేదని తేలితే, పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. ఇతరుల పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నందుకు ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేస్తారు. అవసరమైతే బెగ్గర్స్ యాక్ట్‌లో సవరణలు చేసి, దోషులకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధించేలా చట్టాన్ని కఠినతరం చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ముఠాల చెర నుంచి విడిపించిన చిన్నారుల సంరక్షణ, విద్య, వసతి బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది.
ఈ సందర్భంగా పంజాబ్ సామాజిక భద్రత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు తప్పిపోయి, వారి తల్లిదండ్రులు కడుపుకోతతో ఎదురుచూస్తున్నారు. పిల్లలను కిడ్నాప్ చేసి, వారి జీవితాలను నాశనం చేస్తూ భిక్షాటన చేయిస్తున్న ముఠాల ఆటలను ఇక సాగనివ్వం. ఈ డీఎన్ఏ పరీక్షలతో అలాంటి ముఠాల ఆటకడుతుంది. వారి చెరలో చిక్కుకున్న బాలలను విడిపించి, వారికి బంగారు భవిష్యత్తును అందిస్తాం,” అని స్పష్టం చేశారు.


