Ex-DGP Son Murder Case: పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు, న్యాయవాది అఖీల్ అక్తార్ మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. మరణానికి ముందు అఖీల్ చేసిన ఆరోపణలతో పాటుగా ఆ తర్వాత నమోదైన హత్య కేసుపై ముస్తఫా, ఆయన భార్య మాజీ మంత్రి రజియా సుల్తానా స్పందించారు. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ అఖీల్ చేసిన ఆరోపణలను మహమ్మద్ ముస్తఫా తోసిపుచ్చారు.
నిజమైన దర్యాప్తు ఇప్పుడే మొదలవుతుంది: తనతోపాటుగా తన భార్యపై హత్య కేసు నమోదైన నేపథ్యంలో ముస్తఫా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అంటే నేరం నిరూపితమైనట్లు కాదని అన్నారు. నిజమైన దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమవుతుందని ముస్తఫా తెలిపారు. రాబోయే రోజుల్లో అసలు నిజం బయటపడుతుందని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు వెనుక మురికి రాజకీయాలతోపాటు చౌకబారు ఆలోచనలు ఉన్నాయని ఆరోపించారు. నిరాధార ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వారు సైతం చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
18 ఏళ్లుగా మాదకద్రవ్యాల బానిస: తన కుమారుడు దాదాపు రెండు దశాబ్దాలుగా మాదకద్రవ్యాలకు బానిసంటూ ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. అధిక మోతాదులో బుప్రెనార్ఫిన్ ఇంజెక్ట్ చేయడం వల్ల అఖీల్ మరణించినట్లు తేలిందని తెలిపారు. 2007 నుంటి 18 సంవత్సరం వరకు అఖీల్ వ్యసనానికి తాము చికిత్స అందించామని చెప్పారు. డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే అతడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని తెలిపారు. చండీగఢ్‌లోని అనేక పాఠశాలల నుండి బహిష్కరణకు గురయ్యాడని పేర్కొన్నారు. అఖీల్ మాదకద్రవ్యాల కోసం డబ్బు కావాలని భార్య, తల్లిని వేధించేవాడని తెలిపారు. ఒకసారి తమ ఇంటికి నిప్పును సైతం ముట్టించాడని ముస్తఫా ఆరోపించారు. సైకోసిస్ కారణంగానే అఖీల్ ఏదో ఊహించుకోవడం ప్రారంభించాడని తెలిపారు. తాము ఇంటి విషయాలను నాలుగు గోడల్లోనే పరిమితం చేయడానికి ప్రయత్నించామని చెప్పారు. తాము దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే: అక్టోబరు 16న పంచకులలోని తన ఇంట్లో అఖీల్ అక్తార్ విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబానికి సన్నిహితుడైన షంషుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖీల్ అక్తార్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఆగస్టు 27న అఖీల్ రికార్డు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
వీడియోలో అఖీల్ ఆరోపణలు: నా భార్యకు నాన్నతో సన్నిహిత సంబంధం ఉందని అఖీల్ తెలిపాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ నేను మానసికంగా కుంగిపోయానన అన్నారు. నన్ను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అఖీల్ వీడియోలో పేర్కొన్నాడు. తప్పుడు కేసులో ఇరికించి.. చంపాలని చూస్తున్నారని తెలిపారు. నా జీవితం ప్రమాదంలో ఉందని పేర్కన్నాడు. ఈ వీడియో, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అఖీల్ కుటుంబసభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


