చండీగఢ్, (తెలుగుప్రభ): తల్లి రెండో వివాహం చేసుకున్నంత మాత్రాన మైనర్ కుమార్తె జనన ధ్రువపత్రంలో కన్న తండ్రి పేరును తొలగించి పెంచిన తండ్రి పేరు మార్చలేమని పంజాబ్-హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. జగ్జిత్ సింగ్ పేరును తొలగించి.. తల్లి రెండో భర్త బల్విందర్ కుమార్ పేరును తండ్రిగా నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. 2022 ఏప్రిల్ 25న జారీ చేసిన జనన ధ్రువపత్రంలో ఉన్న తండ్రి పేరును మార్చాలని పిటిషన్లో కోరారు.
బాలిక తల్లి జగ్జిత్ సింగ్తో విడిపోయిన అనంతరం బల్విందర్ కుమార్ను వివాహం చేసుకుని, ఆయన పేరును తన కుమార్తె తండ్రిగా నమోదు చేయాలని అధికారులను కోరారు. అయితే జనన సమయంలో నమోదు చేసిన తల్లిదండ్రుల వివరాలు చట్టబద్ధమైన రికార్డులో భాగమని కోర్టు పేర్కొంది. అనంతరం తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం లేదా వారిలో ఎవరైనా మళ్లీ వివాహం చేసుకోవడం వల్ల జనన సమయంలో నమోదైన తల్లిదండ్రుల వివరాలు మారవని స్పష్టం చేసింది. ఇదే అంశంపై గతంలో ఇచ్చిన ‘పూజా గోయల్ వర్సెస్ హర్యానా ప్రభుత్వం’ తీర్పును కూడా కోర్టు ప్రస్తావించింది.
కుటుంబ పరిస్థితుల్లో తర్వాత చోటుచేసుకున్న మార్పులను కారణంగా చూపి జనన ధ్రువపత్రంలో నమోదైన తల్లిదండ్రుల వివరాలను మార్చలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తండ్రి పేరు మార్పునకు సంబంధించిన పిటిషన్ను విచారించేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ దాన్ని కొట్టివేసి

