BJP President: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమిస్తున్న బీజేపీ.. జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. దీంతో పార్టీకి కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై జోరుగా చర్చ ప్రారంభమైంది. వెంకయ్యనాయుడు, ఎల్‌కే అద్వాణీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలు చేపట్టిన అధ్యక్ష పదవిలో ఎవరు ఆశీనులు కానున్నారా..? అనేది చర్చనీయాంశమైంది. త్వరలోనే బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక కీలకం కానుంది. ఇప్పటికే దేశంలో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ తన హవాను మరింతగా పెంచుకునేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే అధ్యక్షుడి ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరిగి ఉండాలి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లోనూ సంస్థాగత ఎన్నికలు పూర్తి కానున్నాయి. అనంతరం జాతీయ అధ్యక్షులు ఎన్నికల జరగనుంది. ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కకుండా తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్లడంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధహస్తులు. రాష్ట్రపతిగా ఎవరూ ఊహించని విధంగా ఓ దళిత మహిళ అయిన ద్రౌపది ముర్మును నియమించడం.. ఒడిశా ముఖ్యమంత్రిగా సామాన్య నేతను ఎంపిక చేయడం ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి.
ఇప్పుడు పార్టీకి కీలకమైన జాతీయాధ్యక్షుడు ఎంపిక కోసం ఇదే పంథాను ఎంచుకోనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలిసారిగా ఓ మహిళా నేతకు పార్టీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో మహిళల ఓటర్లను ఆకర్షించవచ్చాని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ కేంద్ర మంత్రి, రాజమంహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె గతంలో కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధినేత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీకి మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నమ్మకస్తురాలైన పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణా భారతదేశంలో మహిళలను తమ వైపు తిప్పుకుని పగా వేయాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఎవరిని పార్టీ అధ్యక్ష పదవి వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.