Puri Jagannath Rath Yatra 2025 controversy: ప్రసిద్ధ ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా సాగుతోంది. ఈ నేఫథ్యంలో ఆ రాష్ట్రంలోని ఓ సీనియర్ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఒడిశా రాజకీయాల్లో కలకలం చెలరేగింది.
అసలేం ఏం జరిగిందంటే?
ఇటీవల పూరీ జగన్నాథుడు రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన చోటుచేసుకుందని.. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను చూస్తున్న ఓ పోలీసు అధికారి తన సిబ్బందికి చెప్తున్న సూచనలు వివాదాస్పదమయ్యాయి.
ఆయన ఏమన్నారంటే?
ఆందోళనకారులను అదుపు చేయాలనే ఉద్దేశ్యంతో…భువనేశ్వర్ ఏసీపీ నరసింహ భోల్ తన సిబ్బందితో ఇలా అన్నారు. “ఎవరైనా ఇక్కడికి వస్తే కాళ్లు విరగ్గొట్టండి..ఎవరైతే కాలు విరగ్గొడతారో.. నా దగ్గరికి వచ్చి గిప్ట్ తీసుకోండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త విమర్శలకు దారితీశాయి.
ACP వివరణ
ఈ ఘటనపై స్పందించిన ఏసీపీ నరసింహ భోల్ .. తన మాటలను వక్రీకరించారని, అక్కడ సందర్భాన్ని చూడకుండా కేవలం కొన్ని మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ వీడియోను పూర్తిగా చూస్తే .. ఆందోళనకారులను అరెస్టు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పోలీసు సిబ్బందికి చెబుతున్న విషయం అర్థమవుతుంది. అంతేకాని అందులోని కొన్ని మాటలను పట్టుకుని ఇలా ప్రచారం చేయడం తగదని ఆయన వివరణ ఇచ్చారు. మొదటి బారికేడ్ వద్దకే నిరసనకారులు పరిమితం కావాలని.. అంతేకాని ఎవరైనా రూల్స్ అతిక్రమించి రెండు బారికేడ్లను దాటి వస్తే, వారు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆయన అన్నారు. చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిని నిలువరించే అధికారం తమకు ఉందని.. ఈ సందర్భంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తెలిపారు.