Ragini Das’s journey to Google : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు గురుగ్రామ్‌కు చెందిన రాగిణి దాస్. 12 ఏళ్ల క్రితం తాను ఏ సంస్థలో అయితే ఉద్యోగానికి తిరస్కరణకు గురయ్యారో, నేడు అదే సంస్థలో ఉన్నత స్థాయి పదవిని అధిరోహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. గూగుల్ వంటి టెక్ దిగ్గజంలో ఉద్యోగం సంపాదించాలనేది ఎంతో మంది కల. కానీ, ఆ కలను సాకారం చేసుకోవడంలో ఒకసారి విఫలమైనంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మన ప్రతిభకు పదును పెడితే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని రాగిణి దాస్ విజయగాథ చాటి చెబుతోంది. ఇంతకీ ఎవరీ రాగిణి దాస్? ఆమె ప్రస్థానం ఎలా సాగింది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
విద్యాభ్యాసం, తొలి అడుగులు : గురుగ్రామ్‌లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆమె, పాఠశాలలో కల్చరల్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. అనంతరం ఇంగ్లండ్‌లోని లాంకాస్టర్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో పట్టభద్రురాలయ్యారు. చదువుకునే రోజుల్లోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి ప్రసిద్ధ సంస్థలలో ఇంటర్న్‌షిప్ చేసి, మార్కెట్ రీసెర్చ్, బిజినెస్ ప్లానింగ్ వంటి అంశాలలో నైపుణ్యం సంపాదించారు.
గూగుల్ తిరస్కరణ నుంచి జొమాటోలో కీలక పాత్ర వరకు : చదువు పూర్తయ్యాక 2012లో ‘ట్రైడెంట్ గ్రూప్ ఇండియా’లో ఫ్రంట్‌లైన్ ఆంత్రప్రెన్యూర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. దేశీయ మార్కెటింగ్‌తో పాటు, యూఎస్, యూరప్ మార్కెట్లపై కూడా దృష్టి సారించారు. అయితే, ఆమె కల గూగుల్‌లో ఉద్యోగం సాధించడం. ఈ లక్ష్యంతోనే 2013లో గూగుల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కానీ, చివరి రౌండ్‌లో విఫలమయ్యారు. అదే సమయంలో జొమాటోలో కూడా ఇంటర్వ్యూకు హాజరుకాగా, అక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది.
జొమాటోలో రాగిణి ప్రస్థానం ఆరు సంవత్సరాల పాటు విజయవంతంగా సాగింది. కీ అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్ వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో ‘జొమాటో గోల్డ్’ వ్యవస్థాపక బృందంలో సభ్యురాలిగా, వినియోగదారుల సంఖ్యను పెంచడంలో, ఉత్పత్తి మార్కెట్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్, లెబనాన్ వంటి దాదాపు పది దేశాలలో ‘జొమాటో గోల్డ్’ను ప్రారంభించడంలో ఆమె కృషి ఉంది.
వ్యాపారవేత్తగా ‘లీప్.క్లబ్’ స్థాపన : జొమాటోలో తన అనుభవంతో, 2020లో తన స్నేహితులతో కలిసి ‘Leap.club’ అనే సంస్థను స్థాపించారు. ఈ వేదిక ద్వారా వేలాది మంది మహిళలను వారి కెరీర్ అభివృద్ధి దిశగా ప్రోత్సహించారు. వారి నెట్‌వర్కింగ్ పరిధిని పెంచడం, కెరీర్ అవకాశాలను చూపించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంస్థ ద్వారా మహిళా సాధికారతకు ఆమె ఎంతగానో కృషి చేశారు.
తిరిగి గూగుల్‌కు.. ఈసారి హెడ్‌గా : వివిధ సంస్థలలో పనిచేయడంతో పాటు, వ్యాపారవేత్తగా రాగిణి ప్రతిభను గూగుల్ సంస్థ గుర్తించింది. 12 ఏళ్ల క్రితం తనను తిరస్కరించినప్పటికీ, ఆమె సేవలను ఉపయోగించుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ – ఇండియా’కు హెడ్‌గా ఆమెను నియమించింది. ఈ నియామకం గురించి రాగిణి సోషల్ మీడియాలో పంచుకుంటూ, “జీవితం ఒక చక్రం లాంటిది, తిరిగి అవకాశం వచ్చింది” అని వ్యాఖ్యానించారు. “నా జీవితం పరిపూర్ణమైంది” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
“ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను సరైన వ్యక్తులు, ఉత్పత్తులు, ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటి అభివృద్ధికి సహాయపడటమే మా లక్ష్యం” అని రాగిణి తన కొత్త బాధ్యతల గురించి తెలిపారు. తన పట్టుదల, కృషి, ప్రతిభతో కలలను సాకారం చేసుకున్న రాగిణి దాస్, నేటి యువతకు ఒక స్ఫూర్తి ప్రదాత అనడంలో సందేహం లేదు.


