Homeనేషనల్Rahul Gandhi : మూల్యాంకన ముసుగులో ఫీజుల దోపిడీ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలంటూ రాహుల్ గాంధీ...

Rahul Gandhi : మూల్యాంకన ముసుగులో ఫీజుల దోపిడీ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం!

Rahul Gandhi CBSE OSM controversy : పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను దిద్దడంలో తప్పు బోర్డుది.. కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి వేలల్లో ఫీజులు కట్టాల్సింది మాత్రం విద్యార్థులా? అవును, ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇదే ప్రశ్నతో అల్లాడిపోతున్నారు. 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అవలంబించిన సరికొత్త డిజిటల్ విధానం (OSM – On-Screen Marking) తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, “జేబు దొంగల పట్ల జాగ్రత్తగా ఉండండి.. వారు ప్రస్తుతం సీబీఎస్‌ఈలోనే కూర్చుని ఉన్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు….

- Advertisement -


ఫీజుల దోపిడీపై రాహుల్ ఆవేదన : సీబీఎస్‌ఈ తీసుకొచ్చిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో దొర్లిన ఘోరమైన తప్పులకు విద్యార్థులను శిక్షిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మూల్యాంకనం తర్వాత తమ జవాబు పత్రాలను సరిచూసుకోవడానికి బోర్డు పిండుతున్న భారీ ఫీజుల వివరాలను ఆయన ఎక్స్‌ వేదికగా బయటపెట్టారు.

“సీబీఎస్‌ఈలో జేబు దొంగలు తిష్టవేశారు, వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక విద్యార్థి తన స్వంత జవాబు పత్రాన్ని సరిగ్గా తనిఖీ చేయించుకోవడానికి దాదాపు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

డిజిటల్ స్కాన్ కాపీకి: ఒక సబ్జెక్టుకు రూ.100
రీ-టోటలింగ్ కోసం: ఒక పేపరుకు రూ.100
రీ-మూల్యాంకనం కోసం: ఒక ప్రశ్నకు రూ.250
తప్పు బోర్డుది అయినప్పుడు, ఆ తప్పును సరిదిద్దడానికి పిల్లల నుంచి ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఇలాంటి ధరఖాస్తులు పెట్టుకుంటే, బోర్డు ఎంత మొత్తంలో సంపాదిస్తుందో ఆలోచించాలని ఆయన ఆరోపించారు.

మొబైల్ ఫోన్లతో స్కానింగ్.. ఫలితంగా అస్తవ్యస్తంగా మార్కులు : ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాలను కంప్యూటర్లలో కాకుండా, మొబైల్ ఫోన్ల ద్వారా స్కాన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలాంటి అనాలోచిత విధానాల వల్లే మార్కుల్లో తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయని, ఫలితంగా చాలా మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. “విద్యను సేవల విభాగం నుంచి వ్యాపారంగా మార్చినప్పుడు, తప్పులు సరిదిద్దబడవు.. అవి మరింతగా పెరుగుతాయి” అని ఆయన విమర్శించారు.

విద్యార్థులతో ముఖాముఖి.. “దేశద్రోహులు”గా ముద్ర : ఇటీవల తమ ఫలితాలలో తీవ్ర అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో గొంతు విప్పిన 12వ తరగతి విద్యార్థులను రాహుల్ గాంధీ స్వయంగా కలిసి మాట్లాడారు. తమ జవాబు పత్రాలను మాత్రమే అడుగుతున్న అమాయక విద్యార్థులను కొందరు “యాంటీ నేషనల్ సోరోస్ ఏజెంట్లు”, “పాకిస్థానీలు” అంటూ సామాజిక మాధ్యమాల్లో అవమానించడం అత్యంత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, గళమెత్తిన నిరుపేద విద్యార్థులపై బురద జల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

టెండర్ల వెనుక అవినీతి గుట్టు : సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకన కాంట్రాక్టును పొందిన “కోయెంప్ట్ ఎడ్యుటెక్” (Coempt Eduteck) అనే సంస్థపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో (2019) తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబరీనా (Globarena) సంస్థే పేరు మార్చుకుని ఈ కాంట్రాక్టు దక్కించుకుందని ఆరోపణలు వస్తున్నాయని ఆయన నిరూపించారు. 18.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఇలాంటి వివాదాస్పద కంపెనీ చేతుల్లో పెట్టడం వెనుక ఉన్న అవినీతి ఏమిటో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News