Justice for IPS Puran Kumar: ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది..? ఆయనపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేశాయి? ఈ ఘటన కేవలం ఒక అధికారి మరణమా..? లేక దేశవ్యాప్తంగా ఉన్న దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమా..? హరియాణా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, ఈ ఘటనపై ప్రధాని, ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు..?
హరియాణాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం కాదని, దేశంలోని దళితులందరి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అభివర్ణించారు. మంగళవారం ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
“పూరన్ కుమార్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయనపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారో యావత్ దేశం అర్థం చేసుకోగలదు. ఆయన కెరీర్‌ను నాశనం చేయడానికి, ఆయన్ను అగౌరవపరచడానికి ప్రయత్నించారు. దాని ఫలితంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఆయన మరణానంతరమైనా గౌరవం ఇవ్వండి,” అని మృతుడి భార్య వేడుకుంటున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన వెనుక ఉన్న అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “ఇది కేవలం ఒక కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కాదు. దేశంలోని ప్రతి దళిత కుటుంబానికి సంబంధించినది. బాధ్యులపై వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని నేను ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

