Rahul Gandhi| అదానీ గ్రూప్ భారత్‌లోని సోలార్ పవర్ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చారంటూ అమెరికా దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani), ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ (Sagar Adani)లకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నోటీసులు జారీ చేసింది. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశాన్ని ప్రతిపక్షాలు హైలెట్ చేస్తున్నాయి.
ఇక ఈ వ్యవహారంపై లోక్‌సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారంటూ ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం.. రూ.2వేల కోట్లకు లంచం ఆరోపణలు వచ్చిన అదానీని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా..? అని ప్రశ్నించారు.