Rahul Gandhi atom bomb allegation on EC : “బీజేపీ కోసం ఈసీ ఓట్లు దొంగిలిస్తోంది, మా దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయి!” లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఈ సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ ‘అణుబాంబు’ పేలితే ఈసీ అధికారులు దేశంలో దాక్కోవడానికి చోటుండదంటూ ఆయన చేసిన హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇంతటి తీవ్రమైన ఆరోపణలపై ఎన్నికల సంఘం ఎలా స్పందించింది..? సొంత పార్టీ నేతలే రాహుల్ వైఖరిని ఎందుకు తప్పుబడుతున్నారు..?
భారత ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధారమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలని కొట్టిపారేసింది. ఇలాంటి బెదిరింపులను పట్టించుకోవద్దని, పారదర్శకంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లాలని తమ అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది.
రాహుల్ ఆరోపణ ఏంటంటే : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈసీపై విరుచుకుపడ్డారు. “రాష్ట్ర స్థాయి నుంచి బీజేపీ కోసం ఓట్ల చౌర్యం జరుగుతోందని ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మేం సొంతంగా విచారణ జరపగా ఓ ‘ఆటం బాంబు’ను కనుగొన్నాం. అది పేలిన రోజు ఈసీ దాక్కోవడానికి చోటుండదు. ఈ కుట్రలో పాలుపంచుకున్న అధికారులను రిటైర్ అయినా వదిలిపెట్టం, వెతికి పట్టుకుని శిక్షిస్తాం” అని రాహుల్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఈసీ స్పందన: రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ, వాటిని పూర్తిగా తోసిపుచ్చింది. “ఇలా రోజూ వచ్చే నిరాధారమైన ఆరోపణలను, బెదిరింపులను మేం పట్టించుకోబోం. మా అధికారులు నిబద్ధతతో, పారదర్శకంగా పనిచేస్తారు” అని స్పష్టం చేసింది.
ట్రంప్ వ్యాఖ్యలతో మరో వివాదం.. సొంత పార్టీలోనే విభేదాలు : ఓట్ల చోరీ ఆరోపణలే కాకుండా, మరో విషయంలోనూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రష్యాతో భారత్ సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడం సొంత పార్టీలోనే కలకలం రేపింది.
ట్రంప్ ఏమన్నారంటే : “ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచం కోరుతుంటే, భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొంటోంది” అని ట్రంప్ విమర్శించారు.
రాహుల్ సమర్థన: దీనిపై స్పందించిన రాహుల్, “భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందన్న నిజం ట్రంప్ మాట్లాడారు” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో అసమ్మతి: రాహుల్ వ్యాఖ్యలతో తమ పార్టీ విభేదిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ బహిరంగంగా ప్రకటించారు. ఈయనకి తోడుగా ఎంపీ కార్తి చిదంబరం కూడా రాహుల్ వ్యాఖ్యలను సమర్థించకపోవడం విశేషం. దీంతో రాహుల్ వైఖరిపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

