Rahul Gandhi: డీలిమిటేషన్ పేరుతో బీజేపీ అధికార చోరీకి ప్రయత్నిస్తోందని లోక్‌సభా పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తాజాగా ఆయన ల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా డీలిమిటేషన్‌పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది రాజకీయ కుట్ర
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆ వెంటనే దాని వెనుక ఉన్న ‘డీలిమిటేషన్’ (Delimitation) కుట్రను తప్పుబట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ జరగాలన్న నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేసే ఎత్తుగడ మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన నిప్పులు చెరిగారు.
దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే..
డీలిమిటేషన్ పేరుతో ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు దక్కాల్సిన రాజకీయ హక్కులను లాక్కునేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఆయా వర్గాలకు ఈ బిల్లులో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసింది దక్షిణాది రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని కామెంట్ చేశారు. బీజేపీ చేస్తోన్న ఈ కుటిల ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. మహిళా సాధికారత పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని, అన్ని వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

