HomeTop StoriesRahul Gandhi : స్వేచ్ఛ మన హక్కు... ప్రజాస్వామ్య పరిరక్షణే మన బాధ్యత

Rahul Gandhi : స్వేచ్ఛ మన హక్కు… ప్రజాస్వామ్య పరిరక్షణే మన బాధ్యత

Rahul Gandhi Independence Day message : స్వాతంత్ర్య సమరయోధుల అలుపెరుగని పోరాటాలు, లెక్కలేనన్ని బలిదానాల పునాదులపై నిర్మితమైన భారత స్వేచ్ఛావృక్షం నేడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోందా? స్వాతంత్ర్యం అంటే కేవలం పరాయి పాలన నుంచి దక్కిన విముక్తి మాత్రమేనా.. లేక అంతకుమించిన మహత్తర బాధ్యతా? స్వాతంత్ర్య దినోత్సవ వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరతీశాయి. స్వేచ్ఛ అనేది తాతముత్తాతలు అందించిన సాధారణ కానుక కాదని, దానిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత నేటి తరంపై ఉందని వారు ఉద్ఘాటించారు.

- Advertisement -

సత్యం, అహింసలే మన రక్షాకవచాలు: రాహుల్ గాంధీ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కీలక సందేశాన్ని ఇచ్చారు. స్వేచ్ఛా ఫలాలు అనుభవించడమే కాకుండా, సత్యం మరియు అహింస మార్గాల్లో పయనించడం ప్రతి భారతీయుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని గుండెల్లో నిలుపుకుంటూ, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలనూ అనుక్షణం కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు ముఖ్యంగా యువతరం ఏకతాటిపైకి వస్తుండటం శుభపరిణామమని, పూర్వీకుల త్యాగాలను స్మరిస్తూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన స్వేచ్ఛను అందించాలని రాహుల్ స్పష్టం చేశారు.

ఎర్రకోట నుంచి ప్రచారార్భాటమా? ప్రధాని మోదీపై ఖర్గే విమర్శనాస్త్రాలు : పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

క్రెడిట్ పాలిటిక్స్: ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రతి అభివృద్ధి అంశానికీ తన ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియ అన్నట్లు ప్రచారం చేసుకోవడం శోచనీయమని విమర్శించారు. స్వతంత్ర భారత ప్రగతి ప్రస్థానంలో గత ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ వేసిన బలమైన పునాదులను విస్మరించడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు.

హక్కుల ఆధారిత చట్టాలు: దేశంలో పేదరిక నిర్మూలనకు, అణగారిన వర్గాల ఉన్నతికి ఉపయోగపడిన సమాచార హక్కు, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) వంటి విప్లవాత్మక చట్టాలు యూపీఏ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని గుర్తుచేశారు. ఈ పథకాల రూపకల్పనలో సోనియా గాంధీ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ప్రస్తుత పాలకులు ప్రజలకు ఒక్క కొత్త రాజ్యాంగబద్ధ హక్కును కూడా అందించలేకపోయారని ఎద్దేవా చేశారు.

రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే తక్షణ కర్తవ్యం : స్వాతంత్ర్యం అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల విముక్తి కాదని, పౌరులకు సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయం, నిర్భయంగా మాట్లాడే భావప్రకటనా స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యానికి సార్థకత చేకూరుతుందని ఖర్గే వివరించారు. గడచిన పదేళ్ల కాలంలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సామరస్యం తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల శ్రమకు తగిన న్యాయం, మహిళలకు సాధికారతతో కూడిన సమాన భాగస్వామ్యం, దళిత, గిరిజన, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధ హక్కులు దక్కినప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఖర్గే పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News