Women Reservation Act implementation debate : దేశ రాజకీయాల్లో ‘నారీ శక్తి’ నినాదం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయిస్తూ పార్లమెంట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక చట్టం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చట్టం చేసి మూడేళ్లు దాటుతున్నా ఇంకా ఆచరణలోకి రాకపోవడంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మధ్య పదునైన విమర్శలు చోటుచేసుకున్నాయి.
రాహుల్ సవాల్.. రిజిజు ప్రతిసవాల్ : మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే 2023 నాటి చట్టాన్ని ఎటువంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు జనాభా లెక్కలతో రిజర్వేషన్లను ఎందుకు అనుసంధానిస్తున్నారో స్పష్టం చేయాలని నిలదీశారు. మహిళ సాధికారతపై కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ఈ చట్టాన్ని ఆచరణలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెంటనే ఘాటుగా స్పందించారు. చట్టసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందడానికి దశాబ్దాల కాలం పట్టిందని, కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఈ బిల్లును ఆమోదించలేకపోయిందని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో చారిత్రాత్మకంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను తీసుకొచ్చిందని పేర్కొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తూ, షరతులు లేకుండా మద్దతు ఇవ్వడానికి బదులు అనవసర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

