Rahul Gandhi, Opposition Leaders Detained: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటరు జాబితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఎన్నికల సంఘం కార్యాలయం వైపు బయలుదేరిన కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికార బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కైందంటూ ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి శాంతియుత ర్యాలీగా వెళ్లేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు ప్రయత్నించారు. అయితే, పెద్ద సంఖ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం కేవలం 30 మంది ఎంపీలకు మాత్రమే అనుమతి ఉందని, కానీ 200 మందికి పైగా వచ్చారని పోలీసులు తెలిపారు.
“భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఈ పోరాటం”
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. “ఒక వ్యక్తి, ఒక ఓటు” అనే సూత్రాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ఓటరు జాబితాల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ విషయంపై గత కొంతకాలంగా ప్రతిపక్షాలు గళమెత్తుతున్నాయి. ఓటరు జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచి, తనిఖీకి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.
ముందస్తు ప్రణాళికతో..
తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికతో దేశంలో గందరగోళం సృష్టించాలని చేసే ప్రయత్నాలని కొట్టిపారేశారు. ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ఈ వివాదంపై ఎన్నికల సంఘం కూడా ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ తన ఆరోపణలను ప్రమాణపత్రం మీద రాసి ఇవ్వాలని సవాలు విసిరింది.


