Trump India-Pakistan Mediation Claim: కాల్పుల విరమణపై ట్రంప్ పాతికసార్లు చెప్పినా ప్రధాని మోదీ పెదవి విప్పకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందని, దానిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకూ ట్రంప్ పదేపదే చేస్తున్న ఆరోపణలేంటి…? వాటిపై మోదీ ప్రభుత్వ మౌనానికి కారణమేంటి..? ఈ పరిణామాలు దేశ రాజకీయాల్లో ఎలాంటి దుమారం రేపుతున్నాయి..?
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను తానే కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ ఈ విషయాన్ని 25 సార్లు పునరావృతం చేశారంటే, తెర వెనుక ఏదో జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు:
బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. “భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడానికి ట్రంప్ ఎవరు..? అది ఆయన చేయాల్సిన పని కాదు. అయినా, తానే చేశానని ఆయన 25 సార్లు చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ ఒక్కసారి కూడా స్పందించలేదు,” అని రాహుల్ మండిపడ్డారు. ఒకవేళ ప్రధాని దీనిపై ప్రకటన చేస్తే, ట్రంపే కాల్పుల విరమణ చేయించారని ఒప్పుకోవాల్సి వస్తుందని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/air-india-crash-bodies-swapped-british-victims/
తాము కేవలం కాల్పుల విరమణ గురించే కాకుండా, రక్షణ రంగం, ‘ఆపరేషన్ సిందూర్’ వంటి కీలక అంశాలపై పార్లమెంటులో చర్చించాలని కోరుతున్నామని రాహుల్ పేర్కొన్నారు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వారు ఇప్పుడు చర్చకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఏమిటీ ‘ఆపరేషన్ సిందూర్’:
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులు మరణించిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు మే 7న పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు భారీ నష్టం వాటిల్లినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌పై ట్రంప్ తాను జోక్యం చేసుకుని ఆపేశానని చెబుతుండగా, ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పడంలో వైరుధ్యం ఉందని రాహుల్ విమర్శించారు.ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు.
ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలు:
గత 73 రోజుల్లో ట్రంప్ సుమారు 25 సార్లు భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు చెప్పుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎత్తిచూపారు. “రెండు దేశాల మధ్య ఐదు యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయి. ఆ ఘర్షణ అణుయుద్ధం స్థాయికి పెరిగి ఉండేది, కానీ నేను ఆపాను,” అని ట్రంప్ మంగళవారం కూడా వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలను ఒక ఆయుధంగా వాడి తాను ఈ ఘర్షణను నివారించానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/fake-embassy-ghaziabad-conman-arrested/
ప్రభుత్వం, విదేశాంగ శాఖ స్పందన:
అయితే, భారత ప్రభుత్వం ట్రంప్ వాదనలను స్థిరంగా ఖండిస్తూ వస్తోంది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ డీజీఎంఓ అభ్యర్థన మేరకే సైనిక కార్యకలాపాలను నిలిపివేసినట్లు భారత్ పేర్కొంది. ఈ విషయంలో అమెరికాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాల ప్రస్తావన రాలేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తో ఫోన్‌లో చెప్పినట్లు విదేశాంగ శాఖ గతంలో వెల్లడించింది.


