Rahul Gandhi attacks BJP Govt : “అభివృద్ధి పేరుతో దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. పేదలు, కార్మికుల ప్రాణాలంటే వారికి కేవలం లెక్కలు మాత్రమే!” – ఈ ఘాటు వ్యాఖ్యలతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని ‘భ్రష్ట జనతా పార్టీ’గా అభివర్ణిస్తూ, అవినీతి, అధికార దుర్వినియోగం, అహంకారం అనే విషం వారి రాజకీయాల్లో పాకిపోయిందని ఆయన ధ్వజమెత్తారు.
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న పలు ఘటనలను ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఓ తీవ్రమైన పోస్ట్ చేశారు. #BhrashtJanataParty అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రాహుల్ లేవనెత్తిన కీలక అంశాలు : రాహుల్ గాంధీ, తన ఆరోపణలకు బలం చేకూర్చేలా, దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన పలు విషాద ఘటనలను ప్రస్తావించారు.
అంకిత భండారీ హత్య, ఉన్నావ్ రేప్ కేసు: “ఉత్తరాఖండ్‌లో అంకిత భండారీ హత్య కేసులో, ఏ బీజేపీ వీఐపీని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు? ఉన్నావ్ రేప్ కేసులో, అధికార అహంకారంతో నేరస్థులను ఎలా రక్షించారో దేశం మొత్తం చూసింది,” అని రాహుల్ నిలదీశారు.
ప్రజారోగ్యంతో చెలగాటం: “ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణాలు, గుజరాత్, హర్యానాలలో కలుషిత నీటి సరఫరా.. వ్యాధుల భయం సర్వత్రా వ్యాపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువులను ఎలుకలు చంపడం, ప్రభుత్వ పాఠశాలల పైకప్పులు కూలిపోవడం.. ఇవి నిర్లక్ష్యం కాదు, అవినీతి ప్రత్యక్ష పర్యవసానాలు,” అని ఆయన ఆరోపించారు.
ప్రకృతి విధ్వంసం: “రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాల నుంచి, ఇతర సహజ వనరుల వరకు.. బిలియనీర్ల అత్యాశకు నిబంధనలను కాలరాస్తున్నారు. కొండలను నరికేస్తున్నారు, అడవులను నాశనం చేస్తున్నారు,” అని మండిపడ్డారు.
ప్రమాదాలపై నిర్లక్ష్యం: “వంతెనలు కూలినా, రైలు ప్రమాదాల్లో కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయినా, బీజేపీ ప్రభుత్వం చేసేది ఒక్కటే: ఫోటోలు, ట్వీట్లు, నామమాత్రపు నష్టపరిహారం,” అని ఆయన ఎద్దేవా చేశారు.
“మోదీజీ ‘డబుల్ ఇంజిన్’ పరుగులు పెడుతోంది, కానీ అది కేవలం బిలియనీర్ల కోసమే. సామాన్య భారతీయుడికి, ఈ అవినీతి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి వేగం కాదు, వినాశన వేగం. ప్రతీరోజూ ఎవరో ఒకరి జీవితాన్ని చిదిమేస్తోంది.”
– రాహుల్ గాంధీ

