Indian education system crisis : రేయింబవళ్లు కష్టపడి చదివినా ఫలితం దక్కని దుస్థితి.. పోటీ పరీక్షల వేళ పేపర్ లీకుల పిడుగుపాటు.. అడ్డగోలు ఫీజుల మోతతో విలవిల్లాడుతున్న విద్యార్థి లోకం. ఏ తరాన్నైతే ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆశిస్తున్నామో, అదే తరం నేడు వ్యవస్థాగత లోపాలతో నిరాశానిస్పృహల్లో కూరుకుపోతోంది. దేశ భవిష్యత్తుకు వెన్నెముకైన విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం చెమటోడ్చి చదివే యువత ఆశలను ఈ లోపభూయిష్ట వ్యవస్థ నిలువునా నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. కుప్పకూలుతున్న మౌలిక సదుపాయాలు, పరీక్షల అక్రమాలు యువత నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలంటే నిత్యం ఈ వైఫల్యాలను భరిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధలను స్వయంగా ఆలకించడమే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు.
‘ఛాత్రోం కీ గూంజ్’ ద్వారా యువత గళం: విద్యా రంగంలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు, సమస్యలను నేరుగా తనతో పంచుకోవాలని రాహుల్ గాంధీ ఒక ఆన్‌లైన్ లింక్‌ను పంచుకున్నారు. విద్యార్థుల గొంతుకను జాతీయ స్థాయిలో వినిపించేందుకు సెప్టెంబర్ 19న మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ‘ఛాత్రోం కీ గూంజ్’ సదస్సును నిర్వహించనున్నారు. ఇప్పటికే కోటా, దేహ్రాదూన్, ప్రయాగ్‌రాజ్, పుణె నగరాల్లో నాలుగు విడతలుగా విద్యార్థులతో విస్తృత చర్చలు జరిపిన ఆయన, ప్రతి విద్యార్థి స్వరం నవభారత నిర్మాణంలో ప్రతిధ్వనించే వరకూ తమ పోరాటం ఆగదని ఉద్ఘాటించారు.

