Rahul Gandhi Voter Rights March : పార్లమెంటులో మొదలైన వాగ్వాదం ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది. ఓటర్ల జాబితాలోంచి లక్షలాది పేర్లు గల్లంతయ్యాయని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన అతిపెద్ద దాడి అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఏకంగా ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా వీధుల్లోకి రానున్నారు. ఈసీ, బీజేపీలే లక్ష్యంగా తన పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ, రాహుల్ చేపట్టబోతున్న ఈ ‘ఓట్ అధికార్ యాత్ర’ ఏంటి..? ఈ పోరాటానికి బిహార్ గడ్డనే ఎందుకు ఎంచుకున్నారు..? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి..?
బిహార్ నుంచి యాత్రకు శంఖారావం : ఓటర్ల జాబితాల సవరణ (SIR)లో అక్రమాలు, ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా తన గళాన్ని మరింత ఉధృతం చేస్తూ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఆగస్టు 17 నుంచి ‘ఇండియా’ కూటమి నాయకులతో కలిసి బిహార్ రాష్ట్రవ్యాప్తంగా ‘ఓట్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ యుద్ధాన్ని వీధుల్లోకి తీసుకెళ్తున్నామని, ఈ యాత్ర సెప్టెంబర్ 1న పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే భారీ ర్యాలీతో ముగుస్తుందని ఆయన తెలిపారు.
ఎందుకీ పోరాటం : ఇటీవల బిహార్ ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం (EC) తొలగించడం పెను దుమారానికి దారితీసింది. ఇది అధికార బీజేపీ అండతో జరిగిన కుట్ర అని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంటు ఉభయసభల్లోనూ ‘ఇండియా’ కూటమి ఆందోళనలు చేపట్టగా, సభ పలుమార్లు వాయిదా పడింది. స్కాన్ చేసిన చిత్రాలకు బదులుగా, డిజిటల్ ఓటర్ల జాబితాలను విడుదల చేయాలని రాహుల్ గాంధీ బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే, పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేపట్టగా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు : ఈ అంశాన్ని కేవలం బిహార్‌కే పరిమితం చేయకుండా, దేశవ్యాప్త ఉద్యమంగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికను ప్రకటించింది. ఇది తమకు ‘డూ ఆర్ డై’ సమస్య అని పేర్కొంటూ, మూడు దశల కార్యాచరణను ప్రకటించింది.
ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు, అన్ని జిల్లా కేంద్రాల్లో ‘లోక్‌తంత్ర బచావో మషాల్ మార్చ్’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కాగడాల ప్రదర్శన).
ఆగస్టు 22 – సెప్టెంబర్ 7: అన్ని రాష్ట్ర రాజధానుల్లో ‘ఓట్ చోర్, గద్దీ ఛోడో’ (ఓట్ల దొంగల్లారా.. గద్దె దిగండి) పేరుతో ర్యాలీలు.
సెప్టెంబర్ 15 – అక్టోబర్ 15: ఓటు హక్కును కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నింటిపైనా ‘ఇండియా’ కూటమి ఏకతాటిపై ఉందని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు.


