Saturday, November 15, 2025
Homeనేషనల్Rahul Gandhi: ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు.. సాఫ్ట్‌వేర్‌ను వాడి ఓట్లను తొలగిస్తున్నారన్న...

Rahul Gandhi: ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు.. సాఫ్ట్‌వేర్‌ను వాడి ఓట్లను తొలగిస్తున్నారన్న ప్రతిపక్ష నేత

Rahul Gandhi vs EC: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్‌ చోరీపై గత కొంత కాలంగా పోరాడుతున్న ఆయన తాజాగా మరోసారి ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఓట్ చోరీ కారణంగా ఓట్లను కోల్పోయిన బాధితులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ అంశంపై గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందని, ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా బీహార్‌ రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగిందని.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్‌ నంబర్లను ఉపయోగించి ఓటర్‌ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో గాకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేస్తున్నారని, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని విమర్శించారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఓట్లు తొలగిస్తున్నారని, దీనికి సంబంధించి 100 శాతం ఆధారాలను సేకరించినట్లు చెప్పారు. నా ఆరోపణలపై ఎలా స్పందించాలనేది ఈసీ చేతుల్లోనే ఉందని, కర్ణాటకలోని అలంద్‌లో ఆరువేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. అలాగే ఓట్ల చోరీకి పాల్పడేవారిని ఎన్నికల సంఘం చీఫ్ రక్షిస్తున్నారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ చేస్తున్న అభ్యర్థనలను విస్మరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది హైడ్రోజన్ బాంబ్ కాదని, దానిని త్వరలో పేలుస్తానని ఈసీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

- Advertisement -

ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు..

మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తొలగింపులు వ్యక్తుల ద్వారా కాకుండా, ఓ సాఫ్ట్‌వేర్ ద్వారా కేంద్రీకృతంగా జరిగిందన్నారు. ప్రతి బూత్‌లో మొదటి పేరును ఆ ఆటోమేటెడ్ ప్రోగ్రాం తీసుకుని తొలగించేలా రూపొందించారని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఫోన్‌ నంబర్లను ఉపయోగించారన్నారు. ఓట్ల తొలగింపు గురించి కర్ణాటకలో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈసీకి తెలిపినా పట్టించుకోలేదన్నారు. అయితే, ఈ విమర్శలను ఎన్నికల సంఘం, బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్‌ బాంబ్ తుస్సు అవుతుందని ఎద్దేవా చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad