Rahul Gandhi Alleges Election Fraud: భారత రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం స్వయంగా ఓట్లను దొంగిలిస్తోందని, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఈసీ కళ్లెదుటే మోసం జరిగిందని, దానికి సంబంధించి తమ వద్ద “వందకు వంద శాతం” కచ్చితమైన ఆధారాలున్నాయని ఆయన ప్రకటించారు. “మేం మీ వెంటపడతాం.. తప్పించుకోలేరు,” అంటూ ఈసీ అధికారులకు రాహుల్ చేసిన హెచ్చరిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆర్జేడీ వంటి విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. “ఎన్నికల సంఘానికి నేను ఒక స్పష్టమైన సందేశం పంపాలనుకుంటున్నాను. మీరు, మీ అధికారులు దీని నుంచి సులభంగా తప్పించుకోగలమని భావిస్తే పొరపడినట్లే. మేము మిమ్మల్ని వదిలిపెట్టం, వెంటాడుతూనే ఉంటాం,” అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/irctc-run-secundrabad-to-panch-jyotirlinga-darshan/
ఆధారాలున్నాయంటూ సవాల్: కర్ణాటకలోని ఒకే ఒక్క నియోజకవర్గాన్ని తాము పరిశీలించామని, అక్కడే భారీ మోసం బయటపడిందని రాహుల్ పేర్కొన్నారు. “మేము పరిశీలించిన నియోజకవర్గంలో కొత్తగా వేల మంది ఓటర్లు పుట్టుకొచ్చారు. వారి వయసులు 45, 50, 60, 65 ఏళ్లుగా ఉన్నాయి. ఇది స్పష్టమైన మోసం. కేవలం ఒక్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే, దేశంలోని మిగిలిన చోట్ల ఎలాంటి డ్రామా నడుస్తోందో ఊహించుకోవచ్చు. ఈసీ అధికారులు దీని నుంచి తప్పించుకోలేరు, వారి కోసం మేము తప్పకుండా వస్తాం,” అని ఆయన హెచ్చరించారు.
విపక్షాల ఆరోపణలను ఖండించిన ఈసీ: మరోవైపు, ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. బిహార్‌లో చేపట్టింది సాధారణ సవరణ ప్రక్రియేనని, ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారనే వాదనలో నిజం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. “కొందరు ఈ ప్రక్రియపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లతో దొంగ ఓట్లను ఎలా అనుమతిస్తాం?” అని ఆయన ప్రశ్నించారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/112-air-india-pilots-sick-leave/
బిహార్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 56 లక్షల ఓటర్లను తొలగించాల్సి ఉందని ఈసీ గుర్తించింది. వీరిలో 20 లక్షల మంది మరణించిన వారు, 28 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 7 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ఈసీ వివరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, ఈసీ ఇచ్చిన వివరణతో ఓటర్ల జాబితా అంశం మరింత వేడెక్కింది.


