దేశంలో కుల వివక్ష ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులవివక్ష అనుభవించే వారికే తెలుస్తుందన్న రాహుల్ గాంధి, అగ్ర వర్ణాలకు కుల వివక్ష కనిపించదని ఆరోపించారు. కుల వివక్ష ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, కులగణన ద్వారా వ్యవస్థలను సరిచేయవచ్చని రాహుల్ విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రధాని ఒక్కసారి కూడా కుల వివక్ష గురించి మాట్లాడలేదన్న ఆయన, కులగణనకు మోడీ ఎందుకు భయపడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. మేం కులగణన చేయమంటే సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నావని బీజేపీ విమర్శిస్తోందని భగ్గుమన్నరాహుల్, నిజం చెప్పడం విభజించడమా? అని నిలదీశారు. దేశం ఎదగాలంటే కుల వివక్షను అరికట్టాలని, హైదరాబాద్ లో జరిగిన కులగణన సంప్రదింపుల సమావేశంలో రాహుల్ ప్రసంగించారు.
మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. బోయిన్పల్లిలోని గాంధి ఐడియాలజీ సెంటర్ లో జరిగిన సమావేశంలో ప్రసంగించి తన పర్యటనను ముగించారు.
కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నవారు కుల వివక్షకు అనుకూలంగా ఉన్నట్టే..
రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా కులగణనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుల వివక్ష భారత సమాజంలో అన్ని వ్యవస్థల్లోనూ వేళ్లూనుకుని ఉందని రాజకీయ న్యాయ, కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ఇది రాజ్యమేలుతోందని అన్నారు. కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నవారు కుల వివక్షకు అనుకూలంగా ఉన్నట్టే అన్నారు. కులగణన వల్ల దేశంలో ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు తేలుతుందన్నారు. దీని ద్వారా ఆయా జనాభా నిష్పత్తిని బట్టి నిధులు పంచే వీలుంటుందని రాహుల్ ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో సామాజిక న్యాయం జరుగుతుందని, కులగణన విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండాలని రాహుల్ ఆకాంక్షించారు. కులగణన చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు జరగచ్చని వాటిని సమరించుకుని ముందుకు పోవాలన్నారు. బ్యూరోక్రటిక్ కులగణన వద్దని, పేదల కోణంలోనే కులగణన జరగాలని, అప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందన్నారు. సమాజాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. కుల గణన భవిష్యత్ కు మార్గదర్శనం అవుతుందని రాహుల్ అన్నారు. జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని పార్లమెంట్ లో తాను చెప్పినట్టు, తెలంగాణ దాన్ని మొట్టమొదటిసారి అమల్లోకి తెచ్చిందని రాహుల్ వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అంటరానితనం ఇంకా ఉంది..
దళితుల విషయంలో అంటరానితనం ఇప్పటికీ మనదేశంలో ఉంది. ఈ పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదు. దేశం అన్నివిధాలా ఎదగాలంటే కులవివక్షను అరికట్టాలన్నారు.
రాహుల్-టైటానిక్ థియరీ
“కులవివక్ష సముద్రంలో ఉన్న మంచుగడ్డ లాంటిది”, 90 శాతం మంచుగడ్డలు సముద్రంలోనే ఉంటాయి. పైకి మాత్రం అంత స్పష్టంగా ఈ వివక్ష కనిపించదు, కానీ అంతర్గతంగా వివక్ష మనసమాజంలో వేళ్లూనుకుని ఉంది. టైటానిక్ షిప్ ను తయారు చేసినవాళ్లు అది మునగదని అనుకున్నారు కానీ అది బయలుదేరిన కొన్ని వారాల్లోనే మంచు గడ్డను ఢీకొని మునిగిపోయింది. కులవిక్షను నిర్మూలించకపోతే సమాజానికి కూడా అదే గతి పడుతుందని రాహుల్ హెచ్చరించారు.
మనది ‘రైజింగ్ తెలంగాణ’: సీఎం రేవంత్
మనది ‘రైజింగ్ తెలంగాణ’ అన్న సీఎం రేవంత్ రెడ్డి, కులగణన పూర్తి చేసి, బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామంటూ ప్రసంగించారు. 2025 జనగణనలో కులగణను పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
ఇది ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఆయా కులాల స్థితిగతులను తెలుసుకునేందుకే సర్వే చేపట్టడం తమ ప్రభుత్వం ఒక బాధ్యతగా స్వీకరించిందని సీఎం రేవంత్ తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. సామాజిక బాధ్యత సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారు. మాటలు కాదు చేతలతో చూపాలన్నది ఆయన ఆలోచన, ఆయన ఆలోచనలను నెరవేర్చటమే మా కర్తవ్యంగా భావించి, ఈ ప్రక్రియ మొదలు పెడుతున్నాం. ఇది ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
ఇకపై అన్నింట్లో సామాజిక న్యాయం..
కులగణన ప్రక్రియ సాగాల్సిన తీరు గురించి పౌరసమాజం సూచనలు, సలహాలు తీసుకోవటానికి రాహుల్ గాంధీ ఇక్కడికి రావటం గొప్ప విషయమని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేయటమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అణగారిన వర్గాలకు ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు సమకూర్చామన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలోనూ రిజర్వేషన్లను వందశాతం అమలు చేస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారన్నారు. ఇందులో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. ఇకపై ఏ నియామకం చేపట్టినా ఏ పోటీ పరీక్ష నిర్వహించినా సామాజిక న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ ఉంటుందని సీఎం రేవంత్ వివరించారు.
దేశానికి దశ దిశ
కులగణన విషయంలో దేశానికి దశ దిశ చూపడానికి తెలంగాణలో ప్రక్రియ చేపట్టామని ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం సహా క్యాబినెట్ ఈ అంశంపై దృష్టిసారించిందని తెలిపారు. కులగణనపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయించి తరువాత దాన్ని జీవోగా మార్చి, ప్రణాళిక శాఖ ద్వారా సమాజం ముందు పెట్టామని భట్టీ వివరించారు. కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాలను కలుపుకుని పాదయాత్ర చేసిన రాహుల్ ఈ విషయాన్ని గుర్తించారన్నారు. దేశంలోని వనరులు, సంపద సమాన స్థాయిలో అందరికీ అందుబాటులోకి రావాలంటే కులగణనే దానికి సరైన మార్గమని రాహుల్ బలంగా విశ్వసించారని భట్టీ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మిన రాహుల్ ఈ గడ్డ మీద నుంచే కులగణనకు స్వీకారం చుట్టి, దేశానికి ఆదర్శంగా నిలుస్తామని సాధారణ ఎన్నికలకు ముందే ప్రకటించారని గుర్తుచేశారు. కులగణన సర్వేలో సమాజంలోని అన్ని వర్గాలని పొందుపరిచి వారిని ఏ ప్రశ్నలు అడగాలి, ఎలాంటి సమాచారం సేకరించాలి అనే అంశాలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని చెప్పారు. సమాజంలోని మేధావులు, సామాజిక వేత్తలతో ఈ విషయంపై ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కులగణన అంశంపై గాంధీభవన్ లో ఇప్పటికే కీలక నేతలతో సమాలోచనలు జరిపామన్నారు. మేధావుల సలహాలు కూడా స్వీకరించామన్నారు. తెలంగాణలోని బుద్ధిజీవుల ఆలోచనలకు అనుగుణంగానే కులగణన సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరిస్తామని భట్టీ విక్రమార్క తెలిపారు.
ఇచ్చిన మాట అమలు చేసి తీరతాం
ఎన్నికలకు ముందు తెలంగాణలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ అనేకమంది మేధావులను, కులసంఘాల నేతలను, సామాజిక కార్యకర్తలను కలిశారని చెప్పారు. వాళ్లందరి నుంచీ సేకరించిన అభిప్రాయాల మేరకే కులగణన చేపడతామని రాహుల్ దేశానికి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆ పనిని ప్రారంభించి దేశానికే ఆదర్శంగా నిలువనుందని మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కులగణనకు సిద్ధమైన సందర్భంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి ఆ ప్రక్రియలో భాగస్వామి కావటం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షునిగా ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన వివరించారు.