Friday, November 22, 2024
Homeనేషనల్Job Scam : రైల్వే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోట్లు కొట్టేసిన కేటుగాడు

Job Scam : రైల్వే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోట్లు కొట్టేసిన కేటుగాడు

ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు నిరుద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే బయటపడింది. తనకు పెద్దోళ్లతో పరిచయాలున్నాయని, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు వసూలు చేసి పరారయ్యాడో కేటుగాడు. వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల తనిఖీలు చేసి 28 మందిని ఎంపిక చేశాడు. నకిలీ ఐడీ కార్డులు, ట్రైనింగ్ లెటర్ ఇచ్చి ఓ రైల్వే స్టేషన్ లో నెల రోజులు కూర్చోబెట్టాడు. నిజమే ఉద్యోగం వచ్చేసిందనుకున్నారు. ఇంతకీ వాళ్లకిచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా ?? వచ్చిపోయే రైళ్లను లెక్కపెట్టడం.

- Advertisement -

తమిళనాడుకు చెందిన సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్ లో ఆయనకు ఇటీవల కోయంబత్తూరుకు చెందిన శివరామన్ పరిచయమయ్యాడు. కేంద్ర ప్రభుత్వంలో తనకు పెద్ద పెద్దోళ్లతో పరిచయాలున్నాయని శివరామన్. వాళ్లతో మాట్లాడి.. తెలిసిన, అవసరమైనవాళ్లకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. దీంతో సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను తీసుకువచ్చాడు. ఈ విషయం తెలిసి మధురై నుంచి మరో 25 మంది యువకులు వచ్చారు.

మొత్తం 28 మంది యువకులు శివరామన్ దగ్గరకు వెళ్లగా.. అతను వికాస్ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఒక్కొక్కరి నుండి రూ.2 లక్షల నుండి రూ.24 లక్షల వరకు వసూలు చేశాడు. వాళ్లందరికీ వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, ఫోర్జరీ పత్రాలతో వికాస్ రాణా ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు. వాళ్లందరికీ ఐడీ కార్డులు ఇచ్చి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్ లో శిక్షణ కూడా ఇప్పించాడు.

రోజూ ఎనిమిది గంటల పాటు ఆ స్టేషన్ లో కూర్చోవడం, స్టేషన్ కు వచ్చిపోయే రైళ్లను, వాటికున్న బోగీలను లెక్కించడమే శిక్షణ అని చెప్పాడు. నెల రోజుల పాటు ఈ శిక్షణ పూర్తయ్యాక వికాస్ రాణా వారికి నియామక పత్రాలు ఇచ్చాడు. వాటిని తీసుకొని రైల్వే అధికారుల దగ్గరకు వెళ్లగా..తాము పోయామని తెలిసి అవాక్కయ్యారు. అయినా ఉద్యోగమంటే రైళ్లను లెక్కపెట్టమన్నప్పుడే అర్థమవ్వాలి కదా.. ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని. ఆ 28 మంది యువకుల్ని గొర్రెల్ని చేసి వికాస్ రాణా, శివరామన్ సొమ్ముతో పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న యువకులు, సుబ్బుసామి పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News