Karur Stampede: సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడులోని కరూర్‌లో జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనపై తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయకులైన ప్రజల అసువులు బాసిన వార్తలు తన గుండెను బరువెక్కిస్తోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను సూపర్ స్టార్ రజనీ పోస్ట్ చేశారు.
ప్రజల ప్రాణాలకు మించినదేమీ లేదని, కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని రజనీ సూచించారు. ఇలాంటి విషాద ఘట్టాలు పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని, నాయకులను కోరారు. బాధిత కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వ సహాయం, వైద్య చికిత్స తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దీనిపై ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ, సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
అసలు ఏమైందంటే..
సెప్టెంబర్ 27న టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన భారీ ఎన్నికల సభలో అనుకోని జన సంద్రం కారణంగా తొక్కిసలాట జరిగింది. పక్కన పదుల సంఖ్యలో పిల్లలు, మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం తక్షణ విచారణ, నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం కలిగించింది. ఈ విషాదం 39 మందిని బలి తీసుకోగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తగిన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు స్టార్ట్ చేసి అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తమిళనాడు వ్యాప్తంగా పెరుగుతున్నాయి.
ఈ ఘటన పెద్ద కార్యక్రమాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆయన వ్యాఖ్యలు బాధితులకు నమ్మకం, సామాజిక బాధ్యతను తెలియజేసేందుకు మార్గదర్శకం కావడమే కాకుండా, అధికారులు, నాయకులు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అనే సందేశాన్ని బలంగా ఇచ్చింది తాజా ఘటన.


