Rajinikanth sensational comments: సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ గెలిచారన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని స్పష్టం చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని, అందుకే ఫలితాల అనంతరం ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. విజయ్‌ని సీఎం కాకుండా రజినీకాంత్ పావులు కదుపినట్లు వార్తలొచ్చాయి. దీంతో, ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
Also read: Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు
నాకంటే పాతికేళ్లు చిన్నవాడు.. నేనెందుకు అడ్డుకుంటా..
విజయ్ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లేదని, వయసులో తన కంటే 25 ఏళ్లు చిన్నవాడని తెలిపారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతాను గానీ, విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు. రెండు ప్రధాన పార్టీలను ఢీకొని గెలిచిన విజయ్‌కు తాను శుభాకాంక్షలు తెలిపానని గుర్తుచేశారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి విజయ్ గురించి ప్రస్తావించగా రజినీకాంత్ నవ్వుతూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడాన్నీ రజినీ తాజాగా ప్రస్తావించారు. ఎవరో వ్యక్తి ఫోన్‌లో రికార్డు చేస్తూ అడిగిన ప్రశ్నకు తాను స్పందించలేదన్నారు. తాను అనవసరంగా ఇతర విషయాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదని, అవసరాన్ని బట్టే మాట్లాడుతానన్నారు.

