Ram Charan Couple Met PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు శనివారం కలిశారు. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగియడంతో రామ్ చరణ్, ఉపాసన, లీగ్ ఛైర్మన్ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విరేందర్ సచ్‌దేవా ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానిని కలిశారు.

అనిల్ కామినేని నేతృత్వంలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి ఆర్చరీ ఫ్రాంచైజీ టోర్నమెంట్ ఇది. అక్టోబర్ 2 నుంచి 12 వరకూ ఈ లీగ్ జరుగుతోంది. దీనికి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్. ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (2025)ను చెర్రీ ప్రారంభించారు.

ప్రధానితో భేటీలో లీగ్‌కు సంబంధించిన వివరాలను వివరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి రామ్‌చరణ్ అందించారు. ప్రాచీన భారతదేశ క్రీడ అయిన ఆర్చరీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తిరిగి వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రామ్‌చరణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్చరీ లీగ్ తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా బృందాని ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మోదీని కలిసిన ఫొటోలను రామ్ చరణ్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. మోదీ మార్గదర్శకత్వం, క్రీడల పట్ల మక్కువ ప్రపంచవ్యాప్తంగా ఆర్చరీ వారసత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి దోహదపడుతుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అథ్లెట్స్‌కు అభినందనలు తెలిపారు. మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఈ ప్రాచీన అద్భుతమైన క్రీడలో మున్ముందు చాలా మంది చేరతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కాగా, రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది‘ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.


