Saturday, November 15, 2025
Homeనేషనల్Ramayana Museum: అయోధ్యలో అద్భుతం.. మైనపు బొమ్మల్లో రామాయణ కావ్యం!

Ramayana Museum: అయోధ్యలో అద్భుతం.. మైనపు బొమ్మల్లో రామాయణ కావ్యం!

Ramayana theme wax museum : శ్రీరాముడి జననం నుంచి రావణ సంహారం వరకు… రామాయణంలోని ప్రతి ఘట్టమూ కళ్లకు కట్టినట్లు కదలాడనుంది. సజీవంగా కనిపిస్తున్న మైనపు విగ్రహాల రూపంలో ఆ త్రేతాయుగ అనుభూతిని పంచేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘రామాయణ మైనపు మ్యూజియం’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అసలు ఈ మ్యూజియం ప్రత్యేకతలేంటి..? ఇందులో ఏయే పాత్రల విగ్రహాలు కొలువుదీరాయి..? రామభక్తులకు ఇది ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వనుంది…?

- Advertisement -

పుణ్యక్షేత్రం అయోధ్య మరో అపూర్వ ఘట్టానికి వేదిక కాబోతోంది. రామాయణంలోని 50 కీలక పాత్రల మైనపు విగ్రహాలతో, ప్రపంచంలోనే తొలి ‘రామాయణ మైనపు మ్యూజియం’ రూపుదిద్దుకుంది. రాబోయే దీపోత్సవం సందర్భంగా అక్టోబరు 19న ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ అద్భుత మ్యూజియాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. శ్రీరాముని జీవితంలోని ముఖ్య ఘట్టాలను కళ్ల ముందుంచే ఈ మ్యూజియం, రామభక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లడం ఖాయం.

రూ.6 కోట్ల వ్యయంతో.. కేరళ సంస్థ నిర్మాణం: అయోధ్యలోని చౌరాసి కోసి పరిక్రమ్ మార్గంలో, కాశీరాం కాలనీకి ఎదురుగా 9,850 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఈ మ్యూజియాన్ని నిర్మించారు. మొత్తం రూ.6 కోట్ల వ్యయంతో, పూర్తి ఏసీ హంగులతో రెండు అంతస్తులలో దీనిని తీర్చిదిద్దారు. కేరళకు చెందిన ప్రముఖ ‘సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ’ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ సంస్థకు గతంలో మహారాష్ట్రలోని లోనావాలా, కేరళలోని తిరువనంతపురంలో సెలబ్రిటీల మైనపు మ్యూజియాలను నిర్మించిన ఘనత ఉంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు.

మైనపు మ్యూజియంలో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే అంశాలు..

సజీవ రూపాలు: ఈ మ్యూజియంలో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు సహా రామాయణంలోని 50 ముఖ్య పాత్రల మైనపు విగ్రహాలు జీవకళ ఉట్టిపడేలా కొలువుదీరాయి.

అద్భుత ఘట్టాలు: గ్రౌండ్ ఫ్లోర్‌లో శ్రీరాముడి బాల్యం నుంచి సీతాదేవి స్వయంవరం వరకు జరిగిన ఘట్టాలను ప్రదర్శిస్తారు. మొదటి అంతస్తులో రాముడి వనవాసం, లంకా దహనం, రామ-రావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

ప్రత్యేక ఆకర్షణలు: సీతాపహరణ ఘట్టం, రావణుడిని రాముడు సంహరించే సన్నివేశం, లంకను దహనం చేసే హనుమంతుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 3డీ లైటింగ్ ఎఫెక్టులతో, ముఖ్యంగా హనుమంతుడి విగ్రహంపై అగ్నిఛాయల లైటింగ్ భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురిచేస్తుంది.

త్రేతాయుగ అనుభూతి: మ్యూజియంలో అడుగుపెట్టగానే నిరంతరం వినిపించే ‘రామ తారక మంత్రం’ సందర్శకులను త్రేతాయుగంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గణేశుడి విగ్రహం, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామ్ లల్లా బాల్యరూప విగ్రహం అదనపు ఆకర్షణలు.

ప్రవేశ రుసుము, ఇతర వివరాలు: ఈ మ్యూజియంలోకి ప్రవేశించడానికి ఒక్కొక్కరికీ రూ.100 టికెట్ ధరను నిర్ణయించారు. ఒకేసారి 100 మందిని లోపలికి అనుమతిస్తారు. ఈ మ్యూజియం ద్వారా వచ్చే ఆదాయంలో 12 శాతాన్ని అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయిస్తారు. ఈ నిధులను అయోధ్య అభివృద్ధికి వినియోగిస్తామని మున్సిపల్ కమిషనర్ జయేంద్ర కుమార్ తెలిపారు. సందర్శకుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థలు, 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

“ఈ మ్యూజియం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు, సందర్శకులకు ఉత్తర, దక్షిణ భారత వంటకాలను అందించే స్నాక్ జోన్, కాఫీ హౌస్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది అయోధ్యలో ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మారుతుంది,” అని సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ అధిపతి సునీల్ విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad