Rammohan Naidu on plane crash investigation : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సాగుతున్న అసత్య ప్రచారానికి కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభ వేదికగా అడ్డుకట్ట వేశారు. నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని, తుది నివేదిక వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఈ అంశంపై జరుగుతున్న అనవసర ప్రచారాన్ని, ముఖ్యంగా విదేశీ మీడియా వ్యాప్తి చేస్తున్న అసత్యాలను తీవ్రంగా ఖండించారు. విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే విచారణ జరుపుతోందని సభకు వివరించారు.
దర్యాప్తు నిబంధనల ప్రకారమే: “ప్రమాదంపై AAIB ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను సమర్పించింది. అయితే ఇది కేవలం ప్రమాదం ఎలా జరిగిందనే ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది, దీనిని తుది నిర్ధారణగా భావించకూడదు” అని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర పూర్తి వివరాలు తుది నివేదికలోనే వెల్లడవుతాయని, అప్పటివరకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. “ప్రమాద స్థలంలో అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ను విజయవంతంగా వెలికితీశాం. దానిని డీకోడ్ చేసే ప్రక్రియ పూర్తిగా మన దేశంలోనే జరుగుతోంది. తుది నివేదిక వచ్చాక భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం” అని రామ్మోహన్ నాయుడు సభకు హామీ ఇచ్చారు.
భద్రతపై పూర్తి భరోసా: దేశంలో విమానయాన భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. “ప్రతికూల వాతావరణం, పక్షులు ఢీకొట్టడం వంటి కొన్ని ఊహించని కారణాల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చు. కానీ, నిబంధనల ప్రకారం అన్ని తనిఖీలు పూర్తి చేశాకే విమానం టేకాఫ్ అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా, ఎవరివల్లనైనా నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన ఉద్ఘాటించారు.
సిబ్బంది కొరత లేదు.. అభివృద్ధికి పెద్దపీట: విమానాశ్రయాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నామని, 90 శాతం వరకు ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. “ఈ పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు అయింది. ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది సురక్షితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం, అయితే కొన్నిచోట్ల స్థానిక సమస్యల వల్ల విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో విమానయాన రంగానికి అనేక సంబంధాలు ఉంటాయని, కాబట్టి అంతర్జాతీయ నియమ నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు.


