Rangasamy to take oath as Puducherry Chief Minister: ఇటీవల ఎన్నికలు జరిగిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. అత్యధిక స్థానాలు దక్కించుకున్న ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రంగసామి ముఖ్యమంత్రిగా ఈనెల 13న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకుని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రమంత్రి మాండవీయ, రంగసామి నేతృత్వంలో మిత్ర పక్ష నాయకులు, ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ఎన్డీయే కూటమి అధ్యక్షుడిగా ఎన్.రంగసామిని ఎన్నుకుని, తమ పార్టీల తరఫున ఆయనకు మద్దతు లేఖ అందజేశారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశ్‌నాథన్‌ను లోక్‌నివాస్‌లో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కూటమి నేతలు కోరారు. దీంతో ఈనెల 13న సీఎం రంగసామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే, మంత్రివర్గ సభ్యులు, ఇతర పదవులపై ఇంకా చర్చలు పూర్తికాలేదు. రంగసామి కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. అయితే, మంత్రుల ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే, తొలుత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తి చేసి.. మంత్రుల ప్రమాణస్వీకారం మరో తేదీన జరపాలని నిర్ణయించారు.
Also Read: https://teluguprabha.net/national-news/amit-shah-promises-bengal-development/

