Loan On Siver RBI New Rules: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. లక్ష మార్కును దాటి లక్షా 26 వేలకు చేరువలో ఉంది. ఇక వెండి సైతం తానేం తక్కువ అన్నట్లుగా రోజురోజుకీ దాని విలువ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 1.70 లక్షలు పలుకుతోంది. త్వరలో ఈ రేటు రూ. 2 లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదు. ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే..
వెండిని కేవలం నగలు, అలంకారానికి మాత్రమే కాదు.. ప్లేట్లు, గ్లాసులు, పూజ సామగ్రి రూపంలో దాచుకుంటారు. అయితే పారిశ్రామిక రంగంలో సిల్వర్ డిమాండ్ భారీగా ఉంటుంది. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, ఉత్ప్రేరకాలు, నీటి శుద్ధి, వైద్య రంగం, ఫొటోగ్రఫీ వంటి వాటిలో కూడా వెండిని విరివిగా ఉపయోగించడం వల్ల మార్కెట్లో సిల్వర్ రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
అవసరాల నిమిత్తం మీ వద్ద ఉన్న బంగారంపై బ్యాంకులో ఎలాగైతే లోన్ తీసుకుంటారో.. ఇకపై వెండి పైన కూడా లోన్ తీసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు త్వరలో అమలులోకి రానున్నాయి.
Also Read: https://teluguprabha.net/business/latest-news-on-today-gold-rates/
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఏప్రిల్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం వెండి నగలు, కాయిన్స్ వంటి వాటిని తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ మేరకు వెండిపై కస్టమర్లకు లోన్ మంజూరు చేయాలని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లను తాకట్టుపెట్టడానికి మాత్రం అవకాశం లేదని.. వీటిపై లోన్ కూడా మంజూరు కాదని తెలిపింది.
ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి గరిష్ఠంగా 10 కేజీల వెండి వరకు తాకట్టుపెట్టుకోవచ్చు. వీటితో పాటు 500 గ్రాముల వరకు బరువున్న సిల్వర్ కాయిన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టుకునేలా వెసులుబాటు కల్పించనుంది. అయితే ఇంతకంటే ఎక్కువ బరువున్న వెండిని తాకట్టు పెట్టుకోకూడదని కొత్త మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ప్రజలు మొత్తం మీద వెండిపై రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కాగా, మార్కెట్లో వెండి విలువ ఆధారంగా లోన్ మంజూరవతుందని ఆర్బీఐ పేర్కొంది.


