Eyewitness accounts of Red Fort blast : అది అత్యంత భద్రత ఉండే ప్రాంతం. నిత్యం జనసందోహంతో కళకళలాడే ప్రదేశం. కానీ సోమవారం సాయంత్రం ఆ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది. మనుషుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భీకర పేలుడు మిగిల్చిన దృశ్యాలు ఇవి. పగిలిన గాజు ముక్కలు, రక్తపు మడుగులు, ఛిద్రమైన వాహనాలు, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు… ఆ ఘోరానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. ఆ నరమేధాన్ని కళ్లారా చూసిన వారు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుని వణికిపోతున్నారు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? ఆ నరకాన్ని చూసిన వారి మాటల్లోనే..
చెవులు చిల్లులు పడే శబ్దం.. కంపించిన భూమి : సోమవారం సాయంత్రం, సరిగ్గా 6:55 గంటలకు. ఎర్రకోట ముందు వెళ్తున్న ఓ కారులోంచి చెవులు చిల్లులు పడేంత భయంకర శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ శబ్ద తీవ్రతకు కిలోమీటరు దూరంలో ఉన్న భవనాలు సైతం కంపించాయి. సమీపంలోని చాందినీ చౌక్ ఇళ్ల కిటికీ అద్దాలు గలగలమంటూ రాలిపోయాయి. “పెద్ద ఉరుములాంటి శబ్దం వచ్చింది. మేం భూకంపం అనుకుని బయటకు పరుగులు తీశాం. కానీ బయట దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది,” అని ఓ స్థానిక నివాసి భయంతో చెప్పారు.
కళ్ల ముందే నరమేధం : “ఒక్కసారిగా పెద్ద శబ్దం.. అంతా పొగ. ఆ పొగ తొలగి చూసేసరికి మనుషులు గాల్లోకి ఎగిరి ముక్కలై పడటం చూశాం. ఆ దృశ్యం జీవితంలో మర్చిపోలేం,” అంటూ ఓ టాక్సీ డ్రైవర్ కన్నీటిపర్యంతమయ్యాడు. పేలుడు జరిగిన కారు మంటల్లో చిక్కుకోగా, ఆ మంటలు చుట్టుపక్కల ఉన్న అనేక వాహనాలకు వ్యాపించాయి. రోడ్డంతా రక్తపుటేర్లు పారాయి. శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ పడి ఉన్నాయి. ఆ భయానక వాతావరణంలోనే స్థానిక దుకాణదారులు, టాక్సీ డ్రైవర్లు, ప్రయాణికులు ధైర్యం చేసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తమ వాహనాల్లో, చేతులపై ఎత్తుకుని ఆసుపత్రులకు తరలించారు.
“ఒక చేయి తెగిపడి ఉంది, కాసేపటికే ఎవరో వచ్చి అది నా బిడ్డదే అంటూ ఏడవడం చూసి తట్టుకోలేకపోయాం. అంతా గందరగోళం. ఎవరు బతికారో, ఎవరు చనిపోయారో కూడా తెలియని పరిస్థితి,” అని సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడు తర్వాత ఎర్రకోటకు దారితీసే రహదారి మొత్తం ఓ యుద్ధభూమిని తలపించింది. ఈ ఘటన దేశ రాజధాని భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.


