రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు హస్తినలోని రామ్ లీలా మైదానంలో ఆర్భాటంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
సెలబ్రిటీల సందడి మధ్య
50మంది సినీ స్టార్లతో పాటు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం నభూతో నభవిష్యసి అన్నట్టు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ తహతహలాడుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం చేజారిన 26 ఏళ్ల తరువాత అధికారంలోకి రానుండటంతో కమలనాథుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కైలాష్ ఖేర్ పాటలు పాడుతూ ప్రమాణ స్వీకారోత్సవానికి మరింత జోష్ తేనున్నారు.
ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా
ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా రేఖా గుప్తాతో పాటు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంజిందర్ సిర్సా, అశిష్ సూద్, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
20 రాష్ట్రాల నుంచి
ఎన్డీఏ పాలిత 20 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరుకానుండగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా అతిథుల్లో ఒకరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన ప్రముఖ నేతలంతా ఈ సభకు హాజరయ్యేలా పార్టీ ప్రత్యేక చొరవ తీసుకుంది. వివిధ దేశాల రాయబారులను కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానాలు పంపారు.
మత పెద్దల బృందం
స్పిరుచువల్ లీడర్లుగా మంచి ఆదరణ పొందుతున్న పలువురు ప్రముఖులు కూడా రేఖా గుప్తా పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. రాందేవ్, స్వామి చిదానందా, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రితో పాటు పలువురు మతపెద్దలు కూడా రామ్ లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతున్నారు.