Sunday, July 7, 2024
Homeనేషనల్RBI: జనవరి 1 నుంచి చెలామణిలోకి వెయ్యి రూపాయల నోట్లు.. ఈ ప్రచారంలో నిజమెంత?

RBI: జనవరి 1 నుంచి చెలామణిలోకి వెయ్యి రూపాయల నోట్లు.. ఈ ప్రచారంలో నిజమెంత?

RBI: వచ్చే జనవరి 1 నుంచి వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని ప్రకటించిన నేపథ్యంలో తాజా ప్రచారం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లు పూర్తిగా రద్దవుతాయని, వాటి స్థానంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

దీంతో ఈ ప్రచారంలో నిజానిజాలు తెలుసుకునేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ రంగంలోకి దిగింది. దీనిపై వివరాలు తెలుసుకుని, అసలు విషయం వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు వెయ్యి రూపాయల నోట్లు విడుదల కావట్లేదని చెప్పింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తెలిపింది. ఇదంతా ఫేక్ ప్రచారమని, దీన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది. అలాగే దీని గురించి వచ్చే మెసేజ్‌లు, ట్వీట్లు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచించింది. రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడాన్ని ఆర్బీఐ ఎప్పుడో ఆపేసిందని ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో వీటిని కూడా కేంద్రం త్వరలోనే రద్దు చేయబోతుందనే మరో ప్రచారం కూడా మొదలైంది. అయితే, ఈ ప్రచారంలో కూడా నిజం లేదని పీఐబీ సంస్థ తెలిపింది. రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని సూచించింది. ఆ నోట్లు పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని తెలిపింది. పీఐబీ సంస్థ ప్రభుత్వ పథకాలపై జరిగే ప్రచారాల విషయంలో వాస్తవాలు వెలికి తీస్తుంది. ప్రజల సందేహాలు తీరుస్తుంది. ప్రభుత్వ పథకాల విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఎవరికైనా సందేహాలుంటే ఆ సంస్థకు కాల్ చేసినా స్పందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News