లక్నో, సెప్టెంబర్ 2 (తెలుగుప్రభ): ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఎంపిక చేశారు. బుధవారం ఆయన నియామకానికి సంబంధించిన నిర్ణయం వెలువడింది. 2026 ఏప్రిల్‌లో భారత వాయుసేన నుంచి పదవీ విరమణ చేసిన మిశ్రా.. ఇకపై అయోధ్య రామ మందిర ట్రస్ట్ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా విశిష్ట నాయకత్వాన్ని ప్రదర్శించిన సీనియర్ సైనిక కమాండర్లలో మిశ్రా ఒకరు. ఆపరేషన్‌లో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ‘సర్వోత్తమ యుద్ధ సేవా పతకం’ ప్రదానం చేశారు. యుద్ధం, ఘర్షణ లేదా శత్రుత్వ పరిస్థితుల్లో అత్యున్నత స్థాయి విశిష్ట సేవలకు ఈ పతకాన్ని అందజేస్తారు. భారత సైనిక పురస్కారాల్లో అత్యంత అరుదైన వాటిలో ఇది ఒకటి.
ట్రస్ట్‌కు ఉపయోగపడనున్న అనుభవం
సైనిక రంగంలో ఆపరేషనల్ ప్లానింగ్, సమన్వయం, లాజిస్టిక్స్, భారీ బలగాల నిర్వహణలో మిశ్రాకు ఉన్న విస్తృత అనుభవం ఇప్పుడు రామ మందిర ట్రస్ట్‌కు ఉపయోగపడనున్నది. ఆలయానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రాక, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, పరిపాలనా కార్యకలాపాల నేపథ్యంలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మిశ్రా ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన చర్యల గురించి వివరించారు. పాకిస్తాన్‌లో లోతుగా ఉన్న లక్ష్యాలను భారత దళాలు ఎలా గుర్తించి ధ్వంసం చేశాయో ఆయన వెల్లడించారు. సుమారు 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ లక్ష్యాన్ని స్వల్ప వ్యవధిలో అందిన ఆపరేషనల్ ఆదేశంతో ధ్వంసం చేసిన విషయాన్ని కూడా ఆయన వివరించారు. అయితే ఆపరేషన్‌కు సంబంధించిన పలు కీలక అంశాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రణాళిక, కచ్చితత్వం, సాంకేతిక పరిజ్ఞానం, సాయుధ దళాల వివిధ విభాగాల మధ్య సమన్వయం ఎంత కీలకమో మిశ్రా వివరించారు.
ఉత్తరప్రదేశ్‌తో అనుబంధం
జితేంద్ర మిశ్రాకు ఉత్తరప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం దేవరియా జిల్లాలోని భోపట్‌పురా. అయోధ్యకు రోడ్డు మార్గంలో సుమారు మూడు గంటల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మిశ్రా తండ్రి లెక్చరర్‌గా పనిచేశారు. రామ మందిర ట్రస్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ దైనందిన పరిపాలన, భక్తులకు అందించే సౌకర్యాలు, ఆర్థిక వ్యవహారాలు, సిబ్బంది సమన్వయం, భద్రతా సంస్థలతో సమన్వయం, భారీ స్థాయిలో నిర్వహించే మతపరమైన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను ఆయన పర్యవేక్షించే అవకాశం ఉంది. సైనిక రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన మిశ్రా నియామకంతో రామ మందిర ట్రస్ట్ పరిపాలనకు కొత్త రూపు వస్తుందని భావిస్తున్నారు.

