Vermi Grid Matrix farming method : ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకున్నాక చాలామంది ప్రశాంతంగా గడుపుతారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మాత్రం తన రెండో ఇన్నింగ్స్‌ను మట్టితో ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ‘వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్’ అనే వినూత్న విధానంలో వరి పండించి, రెట్టింపు దిగుబడితో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు ఏమిటీ కొత్త పద్ధతి..? దీనివల్ల పెట్టుబడి తగ్గి, దిగుబడి ఎలా పెరుగుతోంది..?
ఆదర్శ రైతు.. రామ్ రతన్ : ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా, ఝాగ్రహ గ్రామానికి చెందిన రామ్ రతన్ నికుంజ్ (67), సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL)లో ఫోర్‌మెన్‌గా పనిచేసి 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం, తనకున్న ఐదు ఎకరాల భూమిలో ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని సంకల్పించారు.
ఏమిటీ ‘వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్’ పద్ధతి : ఇది సేంద్రియ, ఆధునిక పద్ధతుల మేళవింపు. ఈ విధానంలో పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ.
గ్రిడ్‌లుగా విభజన: ముందుగా పొలాన్ని చిన్న చిన్న గ్రిడ్‌లుగా (భాగాలుగా) విభజిస్తారు.
సేంద్రియ ఎరువులు: ప్రతి గ్రిడ్‌లో వర్మీ కంపోస్ట్, ఇతర సేంద్రియ ఎరువులు వేసి భూమిని సారవంతం చేస్తారు. దీనివల్ల రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది.
దూరంగా నాట్లు: 10-20 రోజుల వయసున్న వరి నారును, ఒక అడుగుకు ఒక మొక్క చొప్పున స్థిరమైన దూరంలో నాటుతారు.
యంత్రాలతో కలుపుతీత: మొక్కల మధ్య దూరం ఉండటం వల్ల, కలుపు తీయడానికి సులభంగా యంత్రాలను ఉపయోగించవచ్చు. కూలీల ఖర్చు తగ్గుతుంది.
ఫలితాలు అద్భుతం.. దిగుబడి రెట్టింపు : ఈ కొత్త పద్ధతి అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని రామ్ రతన్, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
పురుగుమందులు అక్కర్లేదు: మొక్కలు దూరంగా, ఆరోగ్యంగా పెరగడం వల్ల వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, కీటకాలు త్వరగా దాడి చేయవని గ్రామీణ వ్యవసాయ అధికారి సంజయ్ పటేల్ తెలిపారు.
ఖర్చు, శ్రమ తక్కువ: రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకపోవడం, కలుపుతీతకు యంత్రాలను వాడటం వల్ల రైతుకు ఖర్చు, శ్రమ రెండూ తగ్గుతాయి.
దిగుబడి రెట్టింపు: సాధారణ పద్ధతిలో ఎకరానికి 15-20 క్వింటాళ్ల దిగుబడి వస్తే, ఈ ‘వర్మీ గ్రిడ్’ పద్ధతిలో ఎకరానికి కనీసం 35 క్వింటాళ్లు, గరిష్ఠంగా 40-45 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
“ఈ పద్ధతిలో సాగు చేస్తే కష్టం, ఖర్చు తగ్గుతాయి. పంట నాణ్యత పెరుగుతుంది. నా దిగుబడి రెట్టింపు అయింది. ఇతర రైతులు కూడా ఈ కొత్త పద్ధతిని అవలంబించాలి.”
– రామ్ రతన్ నికుంజ్, ఆదర్శ రైతు
రామ్ రతన్ నికుంజ్ విజయం, ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర రైతులకు స్ఫూర్తినిస్తోంది. ఆధునిక సాంకేతికతను, సేంద్రియ పద్ధతులను జోడించి వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించవచ్చని ఆయన నిరూపించారు.


