Saturday, November 23, 2024
Homeనేషనల్Revanth Delhi tour: UPSC తర‌హాలో TSPSC రూపకల్పనకు సహకరించండి

Revanth Delhi tour: UPSC తర‌హాలో TSPSC రూపకల్పనకు సహకరించండి

యూపీఎస్సీ ఛైర్మ‌న్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్, మంత్రి ఉత్త‌మ్ సుదీర్ఘ‌భేటీ

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ కు (యూపీఎస్సీ) సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది.. సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్ధిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం.. అన్నింటా పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంది. ఈవిష‌యంలో మేం యూపీఎస్సీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ)ను ఆ విధంగానే రూపొందించాల‌ని తాము నిర్ణ‌యించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోనికి తెలిపారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి శుక్ర‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుమారు గంట‌న్న‌ర పాటు వారు చ‌ర్చించారు. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంద‌ని, అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌ని చేస్తున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క ప్ర‌క్రియ‌లో నూత‌న విధానాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌నుకుంటున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ యువ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నియామ‌కాల ప్ర‌క్రియ‌పై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కంలో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌ద‌ని, స‌మ‌ర్థత ఆధారంగా ఎంపిక ఉంటుంద‌ని తెలిపారు. తాము 2024 డిసెంబ‌రు నాటికి రెండు ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నామ‌ని, ఇందుకు టీఎస్ పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాల‌నుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రి ఛైర్మ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. గ‌త ప్ర‌భుత్వం టీఎస్ పీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కాన్ని రాజ‌కీయం చేసి, దానినో రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింద‌న్నారు. ఫ‌లితంగా పేప‌ర్ లీకులు, నోటిఫికేష‌న్ల జారీ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల వెల్ల‌డి ఓ ప్ర‌హ‌స‌నంగా మారింద‌న్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌యింద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం, అస‌మ‌ర్ధ‌త‌తో నియామ‌కాల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చోటు చేసుకుంద‌న్నారు. తామ రాజ‌కీయ ప్ర‌మేయం లేకుండా ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కం చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో అవ‌క‌త‌వ‌ల‌కు తావులేకుండా సిబ్బందిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తామ‌ని వివ‌రించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ త‌ర‌హాలో తీర్చిదిద్దాల‌నుకుంటున్నందున టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్ష‌ణ ఇస్తామ‌ని, స‌చివాల‌య సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి వాణీ ప్ర‌సాద్‌ పాల్గొన్నారు.

- Advertisement -

ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించండి

హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలో ఉన్న భూములు కేటాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం క‌లిశారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం అక్క‌డ ఉన్న ర‌క్ష‌ణ శాఖ భూమి 0.21 హెక్టార్ల‌ను బ‌దిలీ చేయాల‌ని కేంద్ర‌ మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. ఆ భాగంలో మిన‌హా స్కైవే నిర్మాణం పూర్తి కావ‌స్తున్నందున ఆ భూమిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని కోరారు. అందుకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సుముఖ‌త వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం ను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూమి అవ‌స‌ర‌మ‌ని దానిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి విజ్ఙ‌ప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్ల‌కోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్య‌త్తులో డ‌బుల్ డెక్క‌ర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తుల‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సానుకూల స్పంద‌న వ్య‌క్తం చేశారు.స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

నిధులు విడుద‌ల చేయండి

తెలంగాణ‌కు వెనుక‌బడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-20, 2021-22 నుంచి 2023-24 వ‌ర‌కు సంవ‌త్స‌రానికి రూ.450 కోట్ల చొప్పున విడుద‌ల చేయాల్సిన రూ.1800 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీలోని ఆమె కార్యాల‌యంలో క‌లిశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.2,233.54 కోట్లు త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

రెండు రోజులు ఢిల్లీలో బిజీబిజీగా ముఖ్య‌మంత్రి…
గురువారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వ‌చ్చిన ముఖ్య‌మంత్రి రెండు రోజుల పాటు బిజీబిజీగా గ‌డిపారు. తొలి రోజు రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్ప‌న కోసం జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ను, హైద‌రాబాద్ మెట్రో విస్త‌ర‌ణ‌, మూసీ రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి, ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు కోసం కేంద్ర గృహ‌నిర్మాణ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి హ‌ర్‌దీప్‌సింగ్ పురీతో భేటీ అయ్యారు. రెండో రోజు శుక్ర‌వారం యూపీఎస్సీ ఛైర్మ‌న్, కార్య‌ద‌ర్శిల‌తో సుదీర్ఘంగా భేటీ అయి టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న అంశంపై చ‌ర్చించారు. హైద‌రాబాద్‌లో ర‌క్ష‌ణ శాఖ భూముల బ‌ద‌లాయింపుపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో, తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన నిధుల‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లిసి చ‌ర్చించారు. రాత్రి ఆయ‌న న్యూ ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News